జాతీయ వార్తలు

ఎవరినీ వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలక్కాడ్/చెన్నై, మే 6: అగస్టా వెస్ట్‌లాండ్ ముడుపుల కుంభకోణంలో దోషులెంతటివారయినా వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రస్తావించడం ద్వారా ఆమెపై పరోక్షంగా విమర్శలు సంధించారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇటలీ కోర్టు తీర్పు ఇచ్చిన అంశంపై వౌనం వీడిన మోదీ ఈ మొత్తం వ్యవహారాన్ని చౌర్యంగా అభివర్ణించారు. కేరళలో జరిగిన సభలో అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందాన్ని, సోలార్ కుంభకోణాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. తమిళనాడులో జరిగిన పలుసభల్లోను ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన ‘అవినీతిపై స్క్రూలు బిగిస్తున్నందుకే నాపై చిందులేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సారథ్యంలో ఢిల్లీలో భారీ ధర్నా జరిగిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేరళ, తమిళనాడు సభల్లో మోదీ విరుచుకుపడడం గమనార్హం. ఈ సభల్లో ఎవరి పేరును, ఏ పార్టీని ప్రస్తావించని మోదీ ‘ఇటలీలో మీ బంధువులెవరైనా ఉన్నారా? లేక నా బంధువులెవరైనా ఉన్నారా.. నేనింతవరకు ఇటలీ వెళ్లలేదు, కనీసం చూడనైనా చూడలేదు. అక్కడ ఎవరినీ కలవలేదు. అలాంటప్పుడు గత ప్రభుత్వానికి చెందిన పెద్దలే ముడుపులు దిగమింగారని ఇటలీ కోర్టే చెప్పినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు?’ అని మోదీ అన్నారు. హెలికాప్టర్ కుంభకోణంలో ముడుపులు దిగమింగిన వారంతా చోరులేనని పేర్కొన్న మోదీ అలాంటి వారిని శిక్షించాలా వద్దా అని ప్రశ్నించారు. న్యాయపరంగా వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటన్నారు. ఈ ముడుపులు మింగింది పెద్దలయినంతమాత్రాన చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోకూడదా అని నిలదీవారు. ఈ చౌర్యానికి పాల్పడిన వారు ఎంతటివారయినా వదిలేది లేదని పునరుద్ఘాటించారు. తానడిగిన ప్రశ్నలకన్నిటికీ తమిళనాడు ప్రజలనుంచి సమాధానం కోరుతున్నానన్నారు. 2జి స్పెక్ట్రం, బొగ్గు గనుల వేలం లాంటి ఎన్నో వ్యవహారాల్లో కాంగ్రెస్ అవినీతి బట్టబయలయిందన్నారు. అవినీతిని అంతం చేసేందుకు తన ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని పేర్కొన్న మోదీ ఇప్పుడుఅవినీతిపరుల వెన్నులో వణుకు పుడుతోందని పేర్కొన్నారు. దోపిడీకి అలవాటుపడిన వారికి మనుగడే కష్టమయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు.
కాగా, కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వ హయాం లో చోటు చేసుకున్న సోలార్ కుంభకోణం, ఇటీవల ఒక దళిత మహిళను దారుణంగా రేప్ చేసి హత్య చేసిన సంఘటనలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనిపిస్తోందని దుయ్యబట్టారు. ‘కేరళలో సోలార్ అనే పదాన్ని ఉపయోగించడానికి సైతం నేను భయపడుతున్నాను. ఎందుకంటే అది ఓ పెద్ద పేలుడునే సృష్టిస్తుంది’ అని యుడిఎఫ్ ప్రభుత్వాన్ని కుదిపేసిన సోలార్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. ఈ కుంభకోణంలో చివరికి ముఖ్యమంత్రి ఊమన్ చాందీపైన కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రజలకు అభివాదం చేస్తున్న
ప్రధాని నరేంద్ర మోదీ

న్యాయవ్యవస్థలోనూ
రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి

రాజ్యసభలో ఎంపీల డిమాండ్ అఖిలపక్ష సమావేశానికి వినతి

న్యూఢిల్లీ, మే 6: న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టాలని శుక్రవారం రాజ్యసభలో పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల అమలు, రాజ్యాంగ సవరణపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఓబిసి, ఎస్‌సి,ఎస్‌టి, మైనారిటీ, మహిళలకు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి వి సదానంద గౌడ స్పందించారు. ఈ మేరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం రాజ్యాంగంలోని 124,127 ఆర్టికల్స్‌కు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు. అంతే తప్ప ఫలానా సమాజిక వర్గం, కులం ఆధారంగా నియామకాలకు ఆస్కారం లేదని మంత్రి వివరించారు. అయితే సభ్యుల సూచనలను సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ, బిఎస్‌పిలు కోటాకు మద్దతు తెలిపాయి. ఈ అంశంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఆర్టికల్ 235 ప్రకారం జిల్లా, సబార్డినేట్ జుడీషియరీ సభ్యులపై పాలనాపరమైన అజమాయిషీ సంబంధిత హైకోర్టులకే ఉంటుందని సదానంద తెలిపారు. నియామకాలకు సంబంధించి విధి విధానాలు, పదోన్నతులు, రిజర్వేషన్లు తదితరాలన్నీ హైకోర్టు పర్యవేక్షిస్తుందన్న మంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సుబ్రతా రాయ్‌కి నాలుగు వారాల పెరోల్

న్యూఢిల్లీ, మే 6: సహారా అధినేత సుబ్రతా రాయ్‌కి నాలుగు వారాల పెరోల్ లభించింది. రాయ్ తల్లి శుక్రవారం ఉదయం కన్నుమూయడంతో ఆయన్ను పెరోల్‌పై విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇందుకు సంబంధించి రాయ్ చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ థాకూర్, న్యాయమూర్తులు ఎఆర్ ధావే, ఎకె సిక్రీల బెంచ్ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదల ఆదేశాలను జారీ చేసిన సుప్రీం కోర్టు.. సహారా డైరెక్టర్ అశోక్ రాయ్‌కి కూడా పెరోల్ మంజూరు చేసింది. ఈ నాలుగు వారాల వ్యవధిలో రాయ్‌ని పోలీసుల రక్షణలో ఉంచాలని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. ఆయన దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పోరంటూ న్యాయవాది నుంచి హామీ తీసుకుంది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు నిధులు సమీకరించాయన్న కేసులో 2014 మార్చి 4 నుంచి రాయ్ తీహార్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే.

నేపాల్ అధ్యక్షురాలి పర్యటన రద్దు

ఖాట్మండు, మే 6: నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ భారత్ పర్యటన రద్దయింది. అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఖరారైన తొలి విదేశీ పర్యటన ఇది. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఆమె భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానం మేరకు విద్యాదేవి ఈనెల 9 నుంచి భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఉజ్జయిని కుంభమేళాలో షాహీ స్నాన కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సిఉంది. విద్యాదేవి భండారి అధికారిక పర్యటన వాయిదా పడినట్టు తమకు సమాచారం అందిందని న్యూఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. నేపాల్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే భండారీ పర్యటన రద్దుచేసుకున్నట్టు తెలిసిందని వారు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో ప్రధాని కెపి ఓలి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మావోయిస్టుపార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ధ్వజమెత్తుతున్నాయి. దానికి తగ్గట్టు ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో యూటర్న్ తీసుకోవడం వంటి రాజకీయ పరిణామాలు అధ్యక్షురాలి విదేశీ పర్యట వాయిదాకు దారితీసింది.

మెడికల్ కాలేజీల తీరు అధ్వాన్నం
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం

ఒడిశా కిమ్స్‌కు రూ. 5కోట్ల జరిమానా

న్యూఢిల్లీ, మే 6: దేశంలో మెడికల్ కాలేజీలు భ్రష్టుపట్టిపోయాయని, వాటి అధ్వాన్న స్థితి గతులను విశే్లషిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ సీట్లును 100 నుంచి 150 సీట్లకు పెంచిన ఒడిశాలోని ఓ ప్రైవేటు కాలేజీపై ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించింది. వైద్య కళాశాలల తీరు విద్యార్థుల భవిష్యత్‌లో చెలగాటమాడే విధంగా ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా వ్యవహరించినందుకు అదేవిధంగా వారిని అయోమయంలో పడేసినందుకు 5 కోట్ల రూపాయల జరిమానా కట్టాలని కళింగ వైద్య శాస్త్రాల సంస్థ(కిమ్స్)ను ఆదేశించింది. ఆరు వారాల వ్యవధిలో ఈ మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రిలో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ ఐదుకోట్ల రూపాయల జరిమానా మొత్తాన్ని ఏ విధంగానూ విద్యార్థుల నుంచి వసూలు చేయకూడదని కూడా జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ ఎన్‌వి రమణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2016-17, 2017-18 విద్యా సంవత్సరాలకు కిమ్స్ 100 సీట్లను 150కి పెంచేసింది.