జాతీయ వార్తలు

అటకెక్కిన హోదా బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు సభ్యుడి బిల్లుకు ఇప్పుడప్పుడే మోక్షం లభించే అవకాశాలు మృగ్యమైపోయాయి. రెండు రోజులు గడువుండగానే బుధవారం లోక్‌సభ నిరవధిక వాయిదా పడటం.. గురువారం రాజ్యసభ కూడా వాయిదా పడుతుండటంతో ఓటింగ్ జరగకుండానే బిల్లు అటకెక్కింది. వాస్తవానికి కేవీపీ ప్రతిపాదించిన బిల్లుపై మామూలుగా అయితే బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఎల్లుండి అంటే 13 తేదీ సాయంత్రం చర్చ అనంతరం ఓటింగ్ జరగాల్సి ఉంది. అనూహ్యంగా బడ్జెట్ సమావేశాలు ముగిసిపోవటంతో ఇక వర్షాకాల సమావేశాల దాకా ఆగక తప్పని పరిస్థితి నెలకొంది. నిజానికి ఏప్రిల్ ఆఖరు శుక్రవారం నాడే రాజ్యసభలో కేవీపీ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ జరగవలసి ఉండింది. అయితే ఆఖరు క్షణంలో తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ లేచి సభలో కోరం లేనందున ఓటింగ్ జరిపేందుకు వీలు లేదని అడ్డం పడ్డారు.
ప్యానెల్ చైర్మన్ కోరం కోసం దాదాపు పది నిమిషాల పాటు గంట మోగించినా కోరం పూర్తి కాకపోవటంతో ఓటింగ్ సాధ్యపడలేదు. గత శుక్రవారం ఇతర ప్రైవేట్ మెంబర్ల బిల్లులు ఉండటంతో హోదా బిల్లును ఈనెల 13 తేదీ శుక్రవారం బిజినెస్‌లో చేర్చారు. రాజ్యసభ కొనసాగితే శుక్రవారం సాయంత్రం కేవీపీ బిల్లుపై ఓటింగ్‌కు అవకాశం వచ్చేది. కానీ, రాజ్యసభ కూడా వాయిదా పడుతుండటంతో అది కుదరటం లేదు.

ప్రధాని డిమాండ్‌నూ అమలు చేయరా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని సైతం అమలు చేయరా? అని తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. రమేష్ బుధవారం రాజ్యసభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఏ.పి.కి ప్రత్యేక హోదాను సమర్థించటంతో పాటు పది సంవత్సరాలు హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిప్పుడు హోదా అంశం చట్టంలో లేదంటున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏ.పి.కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అభివృద్ధి చెందటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా ఎన్నో అమలు కావలసి ఉన్నాయని ఆయన చెప్పారు. ఏ.పికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా ఇంత వరకు అమలు కాలేదని రమేష్ విమర్శించారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరముంటే ఇంత వరకు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా అవసరమైన మేరకు నిధులు ఇవ్వటం లేదని రమేష్ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఎలాంటి సిఫార్సు లేకుండానే అప్పటి ప్రధాని వాజపేయి ఆదేశం మేరకే ఉత్తరాఖండ్‌కు ఆ హోదా కల్పించారని గుర్తు చేశారు. పైగా ఏపీకి ఇస్తామన్న డబ్బుల విషయంలో ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని రమేశ్ తెలిపారు.

అనంతపురాన్ని ఆదుకోండి

కరవుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లాను ఆదుకోవాలని తెలుగుదేశం సభ్యుడు నిమ్మల కిష్టప్ప ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని కోరారు. నిమ్మల కిష్టప్ప బుధవారం లోకసభలో కరవుపై జరిగిన చర్చలో పాల్గొంటూ అనంతపురం జిల్లాలో కరవు మూలంగా ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆయన అన్నారు. కరవు జిల్లాలను ఆదుకోవాలంటూ కేంద్రం పంపించే అధికారుల బృందాలు వచ్చి తిరిగిపోతాయి తప్ప వీటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని కిష్టప్ప విమర్శించారు.