జాతీయ వార్తలు

సరిహద్దు భద్రతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 13: దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించని (జీరో టాలరెన్స్) విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని పేర్కొన్నారు. అందువల్ల 2013లో పాకిస్తాన్ సైనికులు సరిహద్దుల వద్ద మన సైనికుడు హేమ్‌రాజ్ తల నరికి తీసికెళ్లినటువంటి సంఘటనలను నిరోధించగలిగామని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో వసుంధర రాజె ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఇక్కడి జనపథ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతులు తదితరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎన్‌డిఏ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా వేగంగా కదులుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల గతంలో మన సోదరుడు హేమ్‌రాజ్‌ను చేసినట్లుగా ఇప్పుడు ఎవరు కూడా మన సైనికుడి తలను నరికి తీసికెళ్లలేరు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 2013 జనవరి 8న జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైనికులు మన సైనికుడు లాన్స్ నాయక్ హేమ్‌రాజ్ తలను నరికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచ్చిందని పేర్కొంటూ, స్వాతంత్య్రానంతరం మరే ప్రభుత్వం కూడా రైతుల రక్షణ కోసం ఇన్ని పథకాలను అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 33 శాతం పంట దెబ్బతిన్నా రైతులు నష్టపరిహారం పొందేలా మోదీ ప్రభుత్వం విధానాలను మార్చిందని ఆయన వివరించారు. మోదీ ప్రభుత్వం భూసార కార్డులను ప్రవేశపెట్టిందని, ప్రధానమంత్రి ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు.

జైపూర్‌లో ఆదివారం నిర్వహించిన సభలో వేదికపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె

ఉద్యమం తీవ్రం చేస్తాం

మూడు వారాల్లో సమస్యలు పరిష్కరించండి
ఓఆర్‌ఓపిపై మాజీ సైనికుల అల్టిమేటం
లేనిపక్షంలో బిజెపికి ఓటు వేయబోమని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మూడు వారాల్లోగా ఓఆర్‌ఓపి సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాజీ సైనికులు యునైటెడ్ ఫ్రంట్ హెచ్చరించింది. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సైనికులు బిజెపికి ఓటు వేయరని కూడా స్పష్టం చేసింది. మాజీ సైనికుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రం, మధ్యవర్తిగా కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్‌ను కేంద్రం నామమాత్రంగా నియమించిందని ఆరోపించింది. కేంద్ర ప్రకటించిన ఓఆర్‌ఓపిలో సవరణలు తీసుకురావడానికి కేంద్రానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్‌సింగ్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ఆదివారం సైనిక్ ఆక్రోశ్ పేరుతో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఓపికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాబోయే అస్సాం సహా ఇతర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సైనికులు బిజెపికి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో బిజెపికి మాజీ సైనికులు మద్దతు తెలిపినందువల్లే వారు ఊహించినదానికన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో ఓఆర్‌ఓపి అమలు చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి అధికారంలోకి రాగానే మాజీ సైనికులను మోసం చేసిందని సత్బీర్‌సింగ్ ఆరోపించారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బిజెపికి పరాభవం జరిగింది. మా డిమాండ్లను నిర్లక్ష్యం చేసిన పక్షంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సైనికులెవరూ బిజెపికి ఓటు వేయవద్దు అని పిలుపునిచ్చారు.

అలాగే గణతంత్ర దినోత్సవాలను కూడా బహిష్కరించాలని ర్యాలీకి హాజరైన మాజీ సైనికులకు సత్బీర్‌సింగ్ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మరో ఘర్షణ

మురికివాడలో రైల్వే కూల్చివేతలే కారణం

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఢిల్లీలో ‘ఆక్రమణలను’ తొలగించేందుకు రైల్వే శాఖ ఒక మురికివాడను కూల్చివేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజాగా మరో ఘర్షణకు తెరలేపింది. ఈ కూల్చివేతల సమయం లో ఒక శిశువు మృతిచెందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు రైల్వే అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని షాకుర్ బస్తీలో శనివారం ఈ కూల్చివేతలు చేపట్టి ఆ మురికివాడలో దాదాపు 1200 ఇళ్లను తొలగించారు. వౌలిక వసతుల విస్తరణ నిమిత్తం ఆక్రమణలను తొలగించేందుకు ఈ కూల్చివేతలను చేపట్టాల్సి వచ్చిందని, ఆ మురికివాడలోని ప్రజలకు మూడుసార్లు నోటీసులు జారీచేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చివేతల సందర్భంగా ఆ మురికివాడలో 6 నెలల వయసున్న శిశువు మృతిచెందింది. అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తాము కూల్చివేతలు ప్రారంభించడానికి రెండు గంటల ముందే ఆ శిశువు మృతిచెందిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటిని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బట్టల మూట శిశువుపై పడటం వల్లనే ఈ మరణం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కనుక ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ శిశువు మృతిచెందిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా మురికివాడ నుంచి ఖాళీ చేయించిన పేదలకు ఆహారాన్ని, ఆవాసాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు ఇద్దరు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్లను, మరో సీనియర్ అధికారిని ఆయన సస్పెండ్ చేశారు.

ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని షాకుర్ బస్తీలో శనివారం మురికివాడల్లో ఇళ్లను కూల్చివేసిన దృశ్యం