జాతీయ వార్తలు

బూజుపట్టిన విధానాలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రా, జూన్ 14: ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) లాంటి అంతర్జాతీయ సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బూజుపట్టిన విధానాలు, ఆలోచనలు ఆధునిక కాలపు సమస్యలను పరిష్కరించలేవని ఆయన అన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఘనాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్, సోషల్ అండ్ ఎకనామిక్ రిసెర్చ్‌లో సోమవారం విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 1945లో రెండవ ప్రపంచయుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన ఐక్యరాజ్య సమితి తీవ్రమైన మార్పులకు గురయిన నేటి ప్రపంచ సమాజపు అవసరాలను తీర్చజాలదని అన్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద యూనివర్శిటీగా భావిస్తున్న ఈ యూనివర్శిటీకి చెందిన క్రిక్కిరిసిన విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐరాస ఏర్పాటయినప్పుడు కొన్ని దేశాలు మాత్రమే సభ్యులుగా ఉండేవని, అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొందిన ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందిన దేశాలకు ఈ ప్రపంచ సంస్థలో ఎలాంటి సమర్థవంతమైన పాత్ర లేదని అన్నారు. అందుకనే ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) ఐక్యరాజ్య సమితిలో అత్యంత ముఖ్యమైన భద్రతా మండలి లాంటి అంతర్జాతీయ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని తాము కోరుతున్నామని ఆయన అన్నారు. ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నెలవైన భారతదేశం, అలాగే అభివృద్ధికి కేంద్రమైన ఆఫ్రికా ఖండానికి ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం విడ్డూరమని రాష్టప్రతి అన్నారు. బూజుపట్టిన నిర్ణయాలు తీసుకునే విధానాలు కలిగి ఉన్న ఈ సంస్థలు నేటి ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తాయని ఎవరైనా ఆశించగలమా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్టప్రతి యూనివర్శిటీ క్యాంపస్‌లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం కింద ఘనాకు సీట్ల కోటాను ఇప్పుడున్న 250నుంచి 300కు పెంచాలని, అలాగే ఇతర పథకాల కింద స్కాలర్‌షిప్‌లను 20నుంచి 40కి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. అరవై ఏళ్ల క్రితం 190 ఏళ్ల బ్రిటిష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందినప్పటి భారత దేశానికి ఇప్పటి భారతదేశానికి ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడది అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిన దేశమని ఆయన అన్నారు. క్వామే ఎన్‌క్రుమా సమాధిని సందర్శించి ప్రణబ్ అక్కడ ఘనా తొలి అధ్యక్షుడి స్మారకార్థం నిర్మించిన మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి అలీన ఉద్యమం (నామ్) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఘనా తొలి అధ్యక్షుడు ఉపయోగించిన అనేక వస్తువులుంచిన మ్యూజియంను, మెమోరియల్‌ను ఆయన సందర్శించారు.