జాతీయ వార్తలు

జిఎస్టీ ఆశలు హుళక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్నుల బిల్లు (జిఎస్‌టి)పై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలిగే అవకాశం కనిపించటం లేదు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లును ఆమోదింపచేసుకునేందుకు ఎన్డీయే సర్కార్ తాజాగా చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ నాయకత్వంతో సోమవారం జరిగిన విందు భేటీ అసంపూర్తిగా ముగియడంతో జిఎస్‌టిపై ఇప్పట్లో కదలిక లేదన్న స్పష్టమైన సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. వర్షాకాల సమావేశాల మాదిరిగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా వాషవుట్ అయిపోయినట్టేనన్న ఆందోళన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఒక విధమైన వస్తు సేవల పన్నును అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ నాయకులు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మలతో అరుణ్ జైట్లీ విందు భేటీ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి కనిపించలేదు. మరో ఏడు రోజులు మాత్రమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఈలోగానే జిఎస్‌టిపై ఏకాభిప్రాయానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాన్ని చేపట్టింది. ఈ సమావేశం ప్రారంభంలో ఎంతో ఆసక్తిని రేకెత్తించినా అంతిమంగా ‘అసలు ఇది సమావేశమే కాదు’ అంటూ జైట్లీ వ్యాఖ్యానించటంతో ముగిసింది. ఈ భేటీలో లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. అయితే, ఆయన ఢిల్లీలో లేకపోవడం వల్లే రాలేకపోయారంటూ కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. మరోసారి సమవేశం జరగాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. ‘నేడు చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అయితే వ్యవహారం సమసిపోయిందని భావించలేం. అర్థవంతమైన రీతిలో చర్చలు మాత్రం జరగలేదు’ అని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో ప్రధాని మోదీ జరిగిన సమావేశాన్ని ఉటంకించారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య చర్చలన్నవి ఏదోక అంశంపైనే పరిమితం కాకూడదని, కానీ ప్రభుత్వం మాత్రం జిఎస్టీ బిల్లుపైనే తమతో చర్చించాలని భావిస్తోందని తెలిపారు. దీన్నిబట్టి జిఎస్టీ బిల్లుతప్ప ప్రాధాన్యత కలిగిన మరో అంశమే లేనట్టుగా ప్రభుత్వం భావిస్తోందన్నట్టు తెలుస్తోందన్నారు. ఒక్క జిఎస్టీనే కాకుండా అనేక కీలకమైన బిల్లులు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ తగురీతిలో చర్చించడం ద్వారా కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
మరోపక్క పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లో జిఎస్టీ బిల్లు ఆమోదం సాధ్యం కాదన్న సంకేతాలను అందించిన జైట్లీ, సభా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ద్వారానే దేశ పరిపాలన జరగాలన్న మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మాటలను ఉటంకిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను విస్మరిస్తోందన్నారు. పార్లమెంట్ గత సమావేశం ఏమాత్రం జరగలేదని, ప్రస్తుత సమావేశం కూడా అదేవిధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జైట్లీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం గమనార్హం.