జాతీయ వార్తలు

స్వామి తాజా టార్గెట్.. అరవింద్ సుబ్రమణియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: నిన్నటిదాకా ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను టార్గెట్ చేసుకోవడమే కాకుండా ఆయనను తక్షణం ఆ పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘అమెరికా ఫార్మాస్యూటికల్స్ ప్రయోజనాలను కాపాడడానికి భారత్‌కు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలని 2013లో అమెరికా కాంగ్రెస్‌కు చెప్పింది ఎవరు? ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన అరవింద్ సుబ్రమణియన్!! ఆయనను తక్షణం తొలగించండి’ అని సుబ్రహ్మణ్యం స్వామి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. రఘురామ్ రాజన్ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమించబోయేవారిలో అరవింద్ సుబ్రమణియన్ పేరు కూడా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆయనను టార్గెట్ చేయడం గమనార్హం. అంతేకాదు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) క్లాజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చింది కూడా అరవింద్ సుబ్రమణియనేనని మరో ట్వీట్‌లో స్వామి అంటూ, బిజెపి శిబిరంలో శత్రువులను గుర్తించడానికి జైట్లీకి ఆయన సాయపడుతున్నారని కూడా అన్నారు. గత రెండేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలు ఎందుకు రాణించలేక పోయాయో దేశభక్తులైన ట్వీటర్లు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చని, ఆర్థిక మంత్రిత్వ శాఖలో, ఆర్థిక సంస్థల్లో విషపుపురుగులు చాలామంది ఉన్నారని అన్నారు. ప్రవాస భారతీయుడైన సుబ్రమణియన్ అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలమిచ్చింది అమెరికా పౌరుడిగానా లేక భారతీయ పౌరుడిగానా అని కూడా స్వామి తన వరస ట్వీట్లలో వ్యాఖ్యానించారు. కాగా సుబ్రమణియన్‌పై స్వామి చేసిన విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ఆయన అసలు టార్గెట్ రాజన్, సుబ్రమణియన్ కాదని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయేనని, సుబ్రమణ్య స్వామికి ఆర్థిక శాఖ ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారేమోనని అన్నారు. అంతేకాదు నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకున్నట్లయితే దానికి బదులుగా తనకు రాజకీయ లబ్ధి చేకూరుస్తానని ప్రధాని హామీ ఇచ్చారని స్వామి చెప్పుకొంటున్నారని కూడా దిగ్విజయ్ అన్నారు.

ఆయనపై
పూర్తి నమ్మకముంది
అరవింద్‌కు మద్దతుగా నిలిచిన జైట్లీ
న్యూఢిల్లీ, జూన్ 22: ముఖ్య అర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయనను పదవినుంచి తొలగించాలని సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ చేయడంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా రంగంలో దిగారు. సుబ్రమణియన్ పట్ల ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని, ఆయన సలహాలకు ఎంతో విలువ ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఆరోపణలపై స్పందించడానికి ఇబ్బందులుండే పదవుల్లో ఉండే అధికారులపై విమర్శలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని, పరోక్షంగా సుబ్రహ్మణ్య స్వామికి జైట్లీ సలహా ఇచ్చారు. అంతేకాదు సుమ్రహ్మణ్యం స్వామి విమర్శల నేపథ్యంలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ప్రభుత్వం, బిజెపి అండగా నిలవలేదంటూ వచ్చిన వార్తలను జైట్లీ తోసిపుచ్చారు. రాజన్‌పై స్వామి చేసిన విమర్శలతో బిజెపి, ప్రభుత్వం ఏకీభవించలేదని జైట్లీ అన్నారు. మరోవైపు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జైట్లీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయన నిజాయితీ, పారదర్శకత మచ్చలేనవిన్నారు.

జూలై మూడోవారం నుంచి
పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ, జూన్ 22: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడోవారం నుంచి జరుగుతాయి. ఆగస్టు నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహిస్తారని తెలిసింది. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిపిఏ) ఈ నెల 29న సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. బహుశా జూలై 18న మొదలై ఆగస్టు 13 వరకూ సమావేశాలుంటాయని తెలిసింది. హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గల సిసిపిఏ త్వరలోనే సమావేశమై తుదినిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్షం మద్దతు కూడా తీసుకుని జిఎస్‌టి బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర యోచిస్తోంది.