జాతీయ వార్తలు

దూకుడు తగ్గించిన స్వామి మీడియాతో మాట్లాడేందుకు ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బీజేపీ నేతలపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించటంతో ఆయన కాస్త వెనక్కు తగ్గారు. మంగళవారం ఆయన దగ్గరకు వెళ్లిన మీడియాతో మాట్లాడేందుకు తిరస్కరించారు. మీడియా తనను అవమానించిందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని ట్వీట్ చేశారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశభక్తిలో ఎవరికన్నా తక్కువ కాదని కితాబిచ్చారు. అంతేకాదు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులపై స్వామి చేసిన వ్యాఖ్యలను సమంజసం కాదని ఖండించారు కూడా. స్వామి వ్యాఖ్యలు ‘పబ్లిసిటీ స్టంట్’ అని కూడా అన్నారు. అంతే కాదు దేశంలో వ్యవస్థ కంటే ఎవరూ పెద్దవాళ్లు కారని హెచ్చరిక కూడా చేశారు. అంతకుముందు రాజన్‌ను మానసికంగా పూర్తిస్థాయి భారతీయుడు కాదంటూ స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతే రాజన్ తనకు రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగటానికి ఆసక్తి లేదని ప్రకటించారు. తన చైనా పర్యటనపై స్వామి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనను ఒకరోజు కుదించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. అయితే జైట్లీని తాను లక్ష్యం చేసుకోలేదని, కోట్‌లో జైట్లీ అందంగా ఉన్నారని స్వామి అన్నారు. మరోపక్క ముంబైలో ఎమర్జెన్సీ 41వ వార్షిక కార్యక్రమంలో పాల్గొనాల్సిన స్వామి, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఆయన వెనక్కి తగ్గారు.

ఏటిఎం ఆఫీసు లూఠీ
రూ 5 కోట్ల దోపిడీ
థానే, జూన్ 28: ఏడుగురు సభ్యులుగల ఓ ముఠా ఏటిఎంలో నగదునింపే ఆఫీసులో దోపిడీ చేసి ఐదు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో తీన్ హత్ నక ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంకీక్యాప్‌లు, చేతిరుమాళ్లు ముఖాలకు కట్టుకున్న దుండగలు కత్తులు, యాక్సా బ్లేడ్‌తో దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా సిసిటివి కనెక్షన్లు కట్ చేశారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఐదుగురు సిబ్బంది నగదు లెక్కిస్తున్నారు. ముఠాలోని కొందరు సెక్యురిటీ గార్డులు, సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. మిగతావాళ్లు నగదు చేజిక్కించుకున్నారు. పని పూర్తికాగానే దోపిడీ ముఠా పరారైంది. కాగా ఆఫీసు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చారు. దుండగులు హిందీ, మరాఠీ మాట్లాడినట్టు థానే పోలీసు అధికారి సుఖంద నర్కర్ చెప్పారు. పోలీసు కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దోపిడీ జరిగే సమయంలో ఆఫీసులో ఏడెనిమిద కోట్ల రూపాయలున్నాయని సింగ్ తెలిపారు. మొత్తం నగదు లెక్కిస్తే తప్ప ఎంత పోయిందీ తెలియదన్నారు. దుండగులు కత్తులు, ఓ రంపం, ఓ రివాల్వర్‌తో దోపిడీకి పాల్పడినట్టు ఆయన పేర్కొన్నారు. నగదుతోపాటు మొబైల్ ఫోన్లు, సిసిటివి కెమెరా రికార్డర్‌లు ఎత్తుకెళ్లారని అన్నారు.
సాధ్వి ప్రగ్యాసింగ్
బెయిలు పిటిషన్ తిరస్కృతి
ముంబై, జూన్ 28: మాలేగావ్‌లో 2008నాటి కేసులో నిందితురాలైన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక ఎన్ ఐ ఏ న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. ప్రగ్యాసింగ్‌కు దర్యాప్తు సంస్థలు గత నెలలో క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ పిటిషన్‌ను ఎన్ ఐ ఏ కూడా వ్యతిరేకించనప్పటికీ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌డి టేకలే ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చారు. మాలేగావ్ పేలుళ్లకు సంబంధించి తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, పేలుళ్లకు వినియోగించిన మోటారు సైకిల్ తన పేరుపై రిజిస్టర్ అయినప్పటికీ అది తన రామచంద్ర కల్‌సంగ్రా ఆధీనంలో ఉందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కల్‌సంగ్రా పరారీలో ఉన్నారు. నాటి పేలుళ్లలో గాయపడిన నిసార్ అహ్మద్ సయ్యద్ బిలాల్ ఆమె పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.

నాగా మిలిటెంట్ నేత మృతి
న్యూఢిల్లీ, జూన్ 28: నాగా మిలిటెంట్ నాయకుడు, ఈశాన్యభారతంలో మూడు దశాబ్దాలకు పైగా రక్తపాతానికి కారకుడైన ఇసాక్ చిషి స్వు మంగళవారం మరణించారు. 87 ఏళ్ల వృద్ధుడైన ఇసాక్ శరీరంలో పలుభాగాలు చెడిపోవటం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమి తెగకు చెందిన ఇసాక్ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్లు ఆయన క్షపతినిధి కోలీ మెరే తెలిపారు. 1980లో అప్పటి నాగా నేషనల్ కౌన్సిల్ సంతకం చేసిన షిల్లాంగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇసాక్, ఎన్‌ఎస్‌సిఎన్-ఐఎం ప్రధాన కార్యదర్శి తుయింగాలెంగ్ ముయివాతో కలిసి గ్రూపును స్థాపించారు. దీని ద్వారా దశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని సాగించారు. గత ఆగస్టులో ఎన్‌డిఏ ప్రభుత్వంతో శాంతి ఒప్పందం దిశగా ఇసాక్ బృందం తొలి అడుగు వేసింది. ఒప్పందానికి అవసరమైన నిబంధనల అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా చేశారు.
యువతి ప్రాణం తీసిన
మార్ఫింగ్ ఫొటోలు
మనస్తాపంతో ఆత్మహత్య
చెన్నై, జూన్ 28: సామాజిక మీడియాలో జరిగే వికృత ప్రచారం మరో యువతి ప్రాణాలు బలితీసుకుంది. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసిన అశ్లీలమైన రీతిలో వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన వినుప్రియ (21) ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్‌లో తన మార్ఫింగ్ చిత్రాలు రావడం, తన తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. తాను ఎంత చెప్పినా తన తల్లిదండ్రులు నమ్మలేదని, వారే తనను నమ్మలేనప్పుడు బతకడం ఎందుకని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె లేఖలో పేర్కొంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వినుప్రియ పేరుతో ఎవరో ఫేస్‌బుక్ తెరిచి మార్ఫింగ్ ఫొటోలు అందులో ఉంచారని తెలిపారు. కాగా ఈ ఫొటోలకు సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ వారింత వరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వినుప్రియ తల్లిదండ్రులు చెబుతున్నారు.