జాతీయ వార్తలు

త్వరలో ఉమ్మడి పౌర స్మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలు అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఎన్డీయే సిద్ధం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై సూచనలు కోరుతూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ జాతీయ లా కమిషన్ చైర్మన్ బిఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బిజెపి యోచన. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మతి అమలు చేస్తామని గతంలో బిజెపి ప్రకటించటంతోపాటు, ఎన్నికల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని పొందుపర్చటం తెలిసిందే. ప్రధానిగా వాజపేయి హయాంలోనూ బిజెపి ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టిపెట్టినా, అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించటం తెలిసిందే. కొందరు ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పుడు న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అరబ్ దేశాలు సైతం నిషేధించిన దీన్ని మన దేశం ఎందుకు నిషేధించటం లేదన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు విధివిధానాలు సూచించాలంటూ జాతీయ లా కమిషన్‌ను కోరిందని బిజెపి వర్గాలు అంటున్నాయి. దేశంలో ప్రస్తుతం నేర శిక్షాస్మృతి తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో పాటు హిందు వివాహ చట్టం, షరియత్‌కు సంబంధించిన ముస్లిం పర్సనల్‌లా అమల్లో ఉన్నాయి. ముస్లింలు చాలాకాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమలును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయటం అంటే తమ విశ్వాసాలను దెబ్బతీయటమే అన్నది వారి వాదన.
దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయటం గురించి ఎన్డీయే మిత్రులందరితో చర్చించినట్టు సదానంద గౌడ తనను కలిసిన విలేఖరులతో చెప్పారు. ఇది బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉన్న అంశమేనన్నారు. ఈ అంశం పలుమార్లు పార్లమెంటులోనూ చర్చకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరెస్సెస్ చాలాకాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుకు డిమాండ్ చేయటం తెలిసిందే. ఉమ్మడి పౌర స్మృతి అమలుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజలందరికి ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధం కావటాన్ని స్వాగతిస్తానని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి మహేష్ శర్మ చెప్పారు. సిపిఐ కార్యదర్శి డి రాజా కూడా ఉమ్మడి పౌరస్మృతి పట్ల సానుకూలంగా స్పందించారు. దేశంలోని మహిళల హక్కులను పరిరక్షించాల్సి ఉందంటూ, లా కమిషన్ ఏంచెబుతుందనేది చూసిన తరువాత పూర్తిస్థాయి ప్రతిస్పందన ఇవ్వటం మంచిదని అన్నారు. ఇదిలావుంటే దేశ ప్రజలందరికి ఒకే చట్టాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనను పలు ముస్లిం సంస్థలు, ముస్లిం మత పెద్దలు వ్యతిరేకించారు. భారత్‌లాంటి భిన్న మతాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యం కాదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.