జాతీయ వార్తలు

జిఎస్‌టిపై అఖిలపక్షం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లుపై ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించే దిశగా కొత్త మార్గంలో కేంద్రం ముందుకెళుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న దృష్ట్యా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇతర విపక్షాల మద్దతు చూరగొనాలని భావిస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ పక్షాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నా..పార్లమెంట్‌లోని ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతు ఇవ్వగలవన్న ధీమాను ఎన్‌డిఎ సర్కార్ వ్యక్తం చేస్తోంది. ఇతర పార్టీల మద్దతు చూరగొనేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే అఖిల పక్ష సమావేశ ఆలోచనను చురుగ్గా పరిశీలిస్తోంది. జిఎస్‌టి బిల్లును ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించడం లేదని..ఇందుకు ఆ పార్టీకి ఇతర కారణాలెన్నో ఉన్నాయని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలకు చెందిన ఓ సీనియర్ నాయకుడే సూచించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖిల పక్ష సమావేశం జరుగుతుందని గానీ జరగదని గానీ నేను చెప్పడం లేదు..ఇలాంటి సమావేశం ఏ అంశంపైనైనా ఎప్పుడైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు విలేఖరుల భేటీలో పేర్కొనడం గమనార్హం. ఇందుకు సంబంధించి శుక్రవారానికల్లా ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు ‘నేను ఆశావాదిని. లక్ష్య సాధన ప్రయత్నాలను మధ్యలో వదిలి పెట్టే ప్రసక్తే లేదు’అని తెలిపారు. ముఖ్యంగా జిఎస్‌టి బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఆకస్మికంగా అఖిల పక్ష సమావేశ ఆలోచన తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత మూడు రోజులుగా విపక్షాలతో చర్చలు జరిపి జిఎస్‌టిపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఎన్‌డిఎ సర్కార్ విస్తృత ప్రయత్నాలు సాగించింది. మంగళవారం కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేతో వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఆ చర్చలు ఎలా జరిగాయన్న సంకేతాలు మాత్రం వెలుగులోకి రాలేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా కొన్ని బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ మాత్రం ఇందుకు అనుకూలంగా లేరు. జిఎస్‌టి అన్నది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీన్ని గందరగోళం మధ్య ఆమోదించే అవకాశాలు ఉండవన్నది స్పష్టం.