జాతీయ వార్తలు

హోదా రాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రెండు సంవత్సరాలుగా నానుతున్న ఊహాపోహలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఈ అంశంపై ఇకపై ఎలాంటి అంచనాలకు తావులేకుండా తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పేసింది. పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అయితే పాడిందే పాటగా రాష్ట్రాన్ని విభజించిన నాడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలన్నింటినీ మరో రూపంలో పూర్తి చేస్తామంటూ పునరుద్ఘాటించింది. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపాదించిన ప్రైవేటు సభ్యుడి బిల్లుపై గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చకు కేంద్ర ఆర్థికమంత్రి, సభానాయకుడు అరుణ్‌జైట్లీ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజనచట్టంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు నిర్ణీత గడువును నిర్ధారిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలంటూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన ప్రతిపాదనను, హామీలపై ఒక శే్వతపత్రాన్ని విడుదల చేయాలన్న టిడిపి సభ్యుడు సిఎంరమేష్ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం స్పందిచనైనా లేదు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. పోలవరం వరకు ప్రాజెక్టుకు నాబార్డ్ నుండి నిధులు ఇప్పిస్తున్నామంటూ జైట్లీ ప్రకటించినందుకు నిరసనగా ఒడిషాకు చెందిన బిజెడి సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. ప్రత్యేక హోదా కల్పించటం ద్వారా ఎంత లాభం కలిగేదో ఆ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రత్యేక సహాయం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర నిధుల నుండి 42శాతం నిధులను ఆయా రాష్ట్రాలకు అందజేస్తున్నాం. దీంతోపాటు ఆర్థికలోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు నిధులు కూడా ఇస్తున్నాం’’అని వివరించారు. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షంతోపాటు మిత్రపక్షాలకు జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి ఎదిగేంత వరకు కేంద్రం చేయూత ఇస్తుందన్నారు. ‘‘విభజన చట్టంలోని హామీలను అమలుచేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది, నిధుల కేటాయింపు ఈరోజుతో ఆగిపోదు కదా’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. జైట్లీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
* పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు 42 శాతం నిధులు కేటాయించటంతోపాటు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు నిధులు కూడా కేటాయిస్తున్నాం.
* పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంత వరకు 805 కోట్లు ఇవ్వటంతోపాటు నాబార్డ్ నుండి నిధులు ఇప్పించేందుకు మంతనాలు జరుపుతోంది.
* విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.
* ప్రత్యేక రైల్వే జోన్ వ్యవహారం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పరిశీలనలో ఉంది.
* రాజధాని నిర్మాణానికి ఇంతవరకు రూ.2050 కోట్లు ఇచ్చాం.
* కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.6403 కోట్లు ఇచ్చింది.
* ఏపికి పన్ను రాయితీలు ఇవ్వటాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు వ్యతిరేకించారు, ఏపికి రాయితీలు ఇస్తే ఇతర రాష్ట్రాల నుండి పరిశ్రమలు ఏపికి తరలిపోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు.
* ప్రత్యేక హోదా ఇస్తే పథకాల ఖర్చులో కేంద్రం 90 శాతం భరిస్తే రాష్ట్ర 10 శాతం ఖర్చు భరిస్తుంది, ఈ లెక్కన ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్ల ఏపిపై పడే ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం.
* పదమూడో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 64,575 కోట్ల రూపాయలు కేటాయిస్తే పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,06,910 కోట్లు ఇస్తున్నాం.
* పధ్నాలుగో ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను సిఫారసు చేయలేదు. అయితే సంఘం చేసిన ఆర్థిక సిఫారసుల మేరకు ఏపికి ఎంతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది.
* ఏపికి కేంద్రం చేయూత చాలా సంవత్సరాల కొనసాగుతుంది.
అప్పుడు చేసి ఉంటే
సమస్య ఉండేది కాదు: వెంకయ్య వాదన
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని రాష్ట్ర విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడీ సమస్యలు ఎదురయ్యేవి కాదని సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు చర్చలో జోక్యం చేసుకుని మాట్లాడుతూ తమ ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని తు.చ.తప్పకుండా ఆమలు చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని విభజన చట్టంలో చేర్చాలని తాను ఎంత చెప్పినా యుపిఏ ప్రభుత్వాధినేతలు నాడు పట్టించుకోలేదని విమర్శించారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి స్పష్టం చేశారు. కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటం నుండి పారిపోతోందని సిపిఐ సభ్యుడు డి.రాజా ఆరోపించారు. ఏపికి చేయగలిగినంత ఆర్థిక సహాయం చేయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ కూడా కేంద్రానికి తన తరపున విజ్ఞప్తి చేయటం గమనార్హం.

చిత్రం... ఏపికి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో ఆందోళన చేస్తున్న ఎంపీలు