జాతీయ వార్తలు

ఆక్రమిత కాశ్మీర్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ భద్రత, సమగ్రత విషయంలో ఎవ్వరితో ఎలాంటి రాజీ పడేది లేదని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం జమ్ముకాశ్మీర్‌లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆక్రమిత కాశ్మీర్ ప్రజలతో చర్చలు జరుపుతామని శుక్రవారం ఇక్కడ జరిగిన అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశారు. తమ దురాక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలోనూ, బలూచిస్తాన్‌లోనూ పొరుగు దేశం సాగిస్తున్న అఘాయిత్యాలను ఎండగట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 55మందిని బలిగొన్న కాశ్మీర్ అల్లర్లు తనకు తీవ్ర ఆవేదన, బాధ కలిగిస్తున్నాయన్నారు. కాశ్మీర్ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అఖిల పక్ష కమిటీని శ్రీనగర్ పంపించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. మోదీ అధ్యక్షతన దాదాపునాలుగు గంటల పాటు పార్లమెంటు గ్రంథాలయంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, మంత్రులు అరుణ్‌జైట్లీ,సుష్మాస్వరాజ్, అనంతకుమార్, మనోహర్ పారికర్, రాజ్‌నాథ్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టి.డి.పి లోకసభ పక్షం నాయకుడు తోట నరసింహం, టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావుతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ జమ్ముకాశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకంటుందని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కుతంత్రాలను వమ్ము చేసేందుకు వివిధ దేశాల్లో నివసిస్తున్న ఆక్రమిత కాశ్మీర్ ప్రజలతో చర్చలు ప్రారంభించాలని విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించారు. ఆక్రమిత కాశ్మీర్‌లో నెలకొన్న దుర్బర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని వారి నుండి సేకరించి ప్రపంచ ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం జమ్ముకాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం మూలంగానే కాశ్మీర్‌లో అశాంతి నెలకొంటోందని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బూర్హన్ వని ఎన్‌కౌంటర్ తరువాత కాశ్మీర్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల గురించి చర్చించి ఈ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలను సమీక్షించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే జమ్ముకాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు ప్రతిపక్షం తమ మద్దతు ప్రకటించింది. కాశ్మీర్ ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం సూచించింది.
అందరితో చర్చించండి
జమ్ముకాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రూపులతో సంప్రదింపులు జరపాలని ప్రతిపక్షం ప్రభుత్వానికి సూచించింది. వేర్పాటువాదులతో కూడా చర్చలు జరపటంతోపాటు సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇస్తున్న చట్టం అమలు నిలిపివేయాలని ప్రతిపక్షాలు సూచించాయి. ప్రభుత్వం అందరి మంచి,చెడు గురించి ఆలోచిస్తుందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించాలని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. కాశ్మీర్‌లో పరిస్థితులు సామాన్యం చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేసిన సూచనలపై ప్రభుత్వం ఆచీతూచీ స్పందించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, గ్రూపులతో చర్చలు జరిపేందుకు తాము సిద్దమే కానీ వేర్పాటు వాదులతో చర్చలు జరపటం సాధ్యం కావని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. సైన్యానికి ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం అమలును నిలిపివేయటం ఎంత మాత్రం సాధ్యం కాదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

చిత్రం.. కాశ్మీర్ అంశంపై శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం దృశ్యం