జాతీయ వార్తలు

16 దాటితే పెద్దలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇక బాల నేరస్థుల ఆటకట్టు. మైనార్టీ తీరలేదు కాబట్టి ఎలాంటి ఘోరాలకు, నేరాలకు, అఘాయిత్యాలకూ పాల్పడ్డా చిక్కే ఉండదనుకుంటే ఇబ్బందే. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నేపథ్యంలో మహిళలకు మరింత భద్రత కలిగించే దిశగా పార్లమెంట్ బలమైన ముందడుగు వేసింది. హేయమైన, ఘోరమైన ఆకృత్యాలకు పాల్పడే 16-18 సంవత్సరాల వయస్కులను ఇంకెంత మాత్రం బాల నేరస్థులుగా పరిగణించరు. ఇందుకు వీలుగా వయోజనుల వయసును 18నుంచి పదహారుకు తగ్గిస్తూ బాల నేర న్యాయ చట్టాన్ని పార్లమెంట్ సవరించింది.
మానభంగం, హత్య వంటి ఘోర నేరాలకు పాల్పడే 16 సంవత్సరాలు దాటిన వయస్కులను పెద్దలకు వర్తించే చట్టాల ప్రకారమే విచారించి శిక్షిస్తారు. ఈ చట్టాల ప్రకారం ఇలాంటి ఘోరాలకు పాల్పడే వ్యక్తులకు మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత నేర న్యాయ చట్టం ప్రకారం 16-18 సంవత్సరాల వయస్కులు ఎంతటి ఘోరానికి పాల్పడ్డా మూడేళ్లకు మించి వారికి జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉండదు. అంతే కాదు, వీరిని జ్యూవెనైన్ జస్టీస్ బోర్డు కస్టడీలో మాత్రే ఉంచాలి. నిర్భయ కేసులోని ఓ నిందితుడు బాల నేరస్థుడన్న కారణంగా విడుదలైన నేపథ్యంలో ఈ సవరణ చట్టాన్ని పార్లమెంట్ అత్యవసర ప్రాతిపదికన చేపట్టింది. ఈ నేరస్థుడు విడుదలై రెండు రోజులు తిరక్కుండానే సంబంధిత చట్ట సవరణ బిల్లును రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. తమ కుమార్తె హంతకుడు విడుదలైనందుకు తీవ్ర మనస్తాపానికి గురైన నిర్భయ తల్లిదండ్రులు ఈ రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ, ఆమోదాన్ని స్వయంగా వీక్షించారు. ఇప్పటి వరకూ 18 సంవత్సరాల వయస్కులను బాలలుగానే పరిగణించి వారి నేరాలను బాల నేరస్థుల చట్టం ప్రకారమే విచారించేవారు. ఈ తాజా బిల్లు నేపథ్యంలో 16 సంవత్సరాలు దాటిన వయస్కులు తీవ్ర, ఘోర నేరాలకు పాల్పడితే మామూలు చట్టాలే వారికీ వర్తిస్తాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును ప్రకటించింది. కానీ, దీన్ని మరింతగా అధ్యయనం చేయడానికి సెలెక్ట్ కమిటీకి నివేదించాలని వాదించిన వామపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. భావోద్వేగ పరిస్థితులకు లోబడి ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారన్న భావనకు ఆస్కారం ఉండకుండా దీనిపై సమగ్ర చర్చ జరిపేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించాలని ఈ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సమాధానం చెబుతూ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్ట సవరణను చేపట్టామన్నారు. దీని ప్రకారం విధించే అవకాశం ఉన్న శిక్షలు మహిళలపై నేరాలను అరికట్టగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 16 సంవత్సరాలు పైబడిన వారు పాల్పడే హేయమైన, ఘోరమైన నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. ఇందుకు సంబంధించి అనేక నేరాల వివరాలను ఆమె సభ ముందుంచారు. ఈ సవరణ బిల్లు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇది పిల్లలకు వ్యితిరేకం ఎంత మాత్రం కాదన్నారు. పైగా దీని వల్ల పిల్లలు దారితప్పకుండా వారిని సన్మార్గంలో నడిపించడానికి, సంరక్షించడానికీ విలుంటుందని తెలిపారు.
ఎప్పుడైతే నిర్భయ కేసులో బాల నేరస్థుడు చట్ట లోపం కారణంగా విడుదలైపోయాడో..తక్షణమే సవరణ బిల్లును చేపట్టాలంటూ ప్రభుత్వం తీవ్ర స్థాయిలోనే వత్తిడి పెరిగింది.
ఆలస్యంగానైనా ఈ చట్ట సవరణ బిల్లును చేపట్టడం పట్ల నిర్భయ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి ఘోర కృత్యాలకు పాల్పడకుండా పిల్లల్ని ఈ బిల్లు నిరోధించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే తన కుమార్తె విషయంలో అన్యాయం జరిగిందన్న భావన మాత్రం తనను పట్టి పీడిస్తోందని నిర్భయ తల్లి ఈ సందర్భంగా పేర్కొన్నారు.