జాతీయ వార్తలు

ఏ రాష్ట్రానికీ ఇవ్వనంత సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు హరిబాబు నాయకత్వంలో వచ్చిన ముప్ఫై మంది పార్టీ నాయకులు శుక్రవారం అరుణ్ జైట్లీని ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న భారీ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని స్థాయిల్లో అదుకుంటామనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఆయన వారికి సూచించారు.
ముందు హోంవర్క్ చేయండి: నిర్మలా సీతారామన్
ప్రతిపక్ష పార్టీలు మొదట తగినంత హోంవర్క్ చేసి ఆ తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాలని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బిజెపి నాయకులు తనను సన్మానించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని సమస్యగా మార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమేరకు సహాయం చేస్తోందనేది తెలుసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు తగినంత హోంవర్క్ చేయాలని ఆమె హితవు చెప్పారు. కేవలం భావోద్వేగాలతో మాట్లాడకుండా కేంద్రం ఇప్పుడు అందజేస్తున్న సహాయం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా? లేదా? అనే దానిపై చర్చ జరపాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టే రాష్ట్రం పట్ల అందరికీ సానుభూతి ఉన్నదన్నారు.
ప్రజలకు వివరించండి: వెంకయ్య
ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న భారీ సహాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర బిజెపి నాయకులకు పిలుపు ఇచ్చారు. తనను సన్మానించిన అనంతరం రాష్ట్ర నేతలకు ఈ సూచన ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మూలంగా లభించే ప్రయోజనం కంటే అధిక ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తోందని వెంకయ్య ఈ సందర్భంగా చెప్పారు. ఏ.పి పట్ల కేంద్రానికి ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక అభిమానం ఉన్నదనేది రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. ఏ రాష్ట్రానికీ లభించనన్ని నిధులు ఏ.పికి లభిస్తున్నాయనేది ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు వెంకయ్య సూచించారు. ప్రజల్లో సానుకూల ప్రచారం వచ్చేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలంటూ వారి హయాంలో రాష్ట్రానికి ఏమీ జరగలేదనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని వెంకయ్య తెలిపారు. 14వ అర్థిక సంఘం సిఫారసుల మేరకే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వివిధ సంస్థలను పది సంవత్సరాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేయవలసి ఉండగా తమ ప్రభుత్వం దాదాపు తొంభై శాతం పనులను రెండేళ్లలో పూర్తి చేసిందన్నారు. రైల్వే జోన్‌పై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, నిర్ణయం తీసుకుంటే అది విశాఖకు అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెంకయ్య వివరించారు.
భార్యాభర్తల సంబంధం: సిద్దార్థనాథ్
బిజెపి, తెలుగుదేశం సంబంధం భార్యాభర్తల సంబంధం లాంటిదని బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ ప్రకటించారు. హోదా వల్ల కలిగే లాభం కంటే ఎక్కువ లాభం కలుగుతోందనేది రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. 2019 తర్వాత కూడా బిజెపి, టిడిపి కలిసి ఉంటాయని జోస్యం చెప్పారు.

శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన ఏపి బిజెపి నేతలు కంభంపాటి, కావూరి, గోకరాజు గంగరాజు