జాతీయ వార్తలు

ఉగ్రవాదులను ప్రశంసించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పాత్రికేయులు వార్తారచనలో వాస్తవాలకు కట్టుబడి ఉండాలని, సంచలనాలకు తావివ్వకూడదని, కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని నిరుత్సాహపరచాలని, ఉగ్రవాదులను ప్రస్తుతించకూడదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) 49వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో ఉగ్రవాద కార్యకలాపాలలో నిందితులయిన వారిని ప్రశంసించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ‘ఈ రోజుల్లో ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు, బందిపోట్ల విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కొంతమంది అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్, మక్బూల్ భట్, బుర్హాన్ వనీలను కీర్తించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘ఉగ్రవాదులకు సహకరిస్తున్న, విరాళాలిస్తున్న, వారిని ప్రోత్సహిస్తున్న పొరుగు దేశం చెవులకు ఇది శ్రావ్యమైన సంగీతంలా ఉంటుంది.. కాని, మీరు పాత్రికేయులు, భారతదేశ పౌరులు. దేశం పట్ల మీకు బాధ్యత, కర్తవ్యం ఉంది’ అని ఆయన అన్నారు. జర్నలిస్టులు వార్తలను, దృక్పథాలను మిళితం చేయకూడదని, వాస్తవాలకు కట్టుబడి ఉండాలని ఆయన ఐఐఎంసి విద్యార్థులకు ఉద్బోధించారు.
‘వాస్తవానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలనేది మీడియాకు నా సలహా. కాని, దురదృష్టవశాత్తు సంచలనాలకే నేడు అగ్రతాంబూలం లభిస్తోంది. వారు సంచలనాత్మక శీర్షికలను కోరుకుంటున్నారు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ‘సమాజానికి కులంతో పొంతన లేదు. కాని, కొంతమంది ప్రజలలో ఉన్న కుల, మత, భాష, ప్రాంతీయ భావోద్వేగాలను వినియోగించుకుంటున్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘జర్నలిజం ఒక మిషన్ వలె ఉండాలి. కమీషన్ కోసం కాదు’ అని ఆయన విద్యార్థులకు సూచించారు. కాని, దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో మనం ‘పెయిడ్ న్యూస్’, స్పాన్సర్డ్ న్యూస్’ వంటివి చోటు చేసుకుంటున్నట్టు వింటున్నామని ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం నేపథ్యంలో తలెత్తిన హింస గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై బస్సులను ఎందుకు దగ్ధం చేయాలని ప్రశ్నించారు. పాత్రికేయులు ఇలాంటి ధోరణుల బారిన పడకూడదని ఆయన సూచించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను అంతా గర్వంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐఐఎంసి 49వ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో
ఓ విద్యార్థినికి డిగ్రీ పట్టా అందిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు