జాతీయ వార్తలు

ఎన్‌జిటి ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు, వేర్వేరు నగరాల్లో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ధర్మాసనం (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి) జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఎన్‌జిటి జారీ చేసిన ఆదేశాలను నిలిపివేసినట్లు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్, న్యాయమూర్తి ఎఎం ఖన్‌విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఎన్‌జిటి జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డిఎఫ్‌సిసిఐఎల్), మెట్రో రైల్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదిస్తూ నగరాలలో మెట్రో రైల్‌తో పాటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఎన్‌జిటి ఆదేశించడం అసంబద్ధమని ఆయన వాదించారు. అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కూడా ఈ రైల్వే ప్రాజెక్టుల వల్ల ప్రజలు తమ ప్రయాణానికి కార్లపై, సరుకుల రవాణాకు ట్రక్కులపై ఆధారపడటం తగ్గుతుందని, ఫలితంగా వాతావరణ కాలుష్యం తగ్గుతుందని వాదించారు.
ఆసియా టాప్-25లో
సాలార్‌జంగ్ మ్యూజియం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఆసియాలోని టాప్-25 మ్యూజియంలలో హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం నాలుగో స్థానం దక్కించుకుంది. భారత్‌లో తప్పనిసరిగా చూ డాలనుకునే దర్శనీయ మ్యూజియంలలో లేహ్‌లోని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఉదయ్‌పూర్‌లోని బాగోర్ కి హవేలీ, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, జైసల్మేర్‌లోని వార్ మ్యూజియం, పుణెలోని దర్శన్ మ్యూజియం, షిల్లాంగ్‌లోని డాన్‌బాస్కో సెంటర్ ఫర్ ఇన్‌డెజినెస్ కల్చర్స్, తౌరులోని హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం, కొల్హాపూర్‌లోని సిద్ధగిరి మ్యూజియం, ఢిల్లీలోని గాంధీ స్మృతి - తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఏడాది వ్యవధిలో ఈ మ్యూజియంలకు వచ్చిన రేటింగ్‌ల ఆధారంగా ట్రిప్ అడ్వైజర్ అనే సంస్థ ట్రావెలర్స్ చాయిస్ అవార్డులను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్-25 జాబితాలో భారత్‌లోని ఏ ఒక్క మ్యూజియం కూడా స్థానం దక్కించుకోలేదు. ఇక ఆసియా జాబితా విషయానికొస్తే చైనాలోని కిన్ టెర్రాకోట వారియర్స్ అండ్ హార్స్ తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. సందర్శకులు ఇచ్చే రేటింగ్‌ల ఆధారంగా ఇచ్చే ట్రావెలర్స్ చాయిస్ అవార్డువల్ల దర్శనీయ స్థలాలపై సందర్శకులకు అవగాహన పెరిగేందుకు దోహదపడతాయని భారత్‌లోని ట్రిప్ అడ్వైజర్ మేనేజర్ నిఖిల్ గంజు వెల్లడించారు.

శిక్ష తగ్గించడం తప్పే!
సౌమ్య కేసులో
సుప్రీం తీర్పుపై కట్జు వ్యాఖ్యానం
తిరువనంతపురం, సెప్టెంబర్ 16: కేరళకు చెందిన సౌమ్య అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష రద్దుచేయడాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు తీవ్రంగా తప్పుపట్టారు. అత్యంత కిరాతకంగా ఓ యువతిని మానభంగం చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడికి మరణశిక్షను రద్దుచేసి జీవితకాల శిక్షను విధించడం చట్టపరంగా జరిగిన తీవ్రమైన తప్పుగా కట్జు పేర్కొన్నారు. 2011 ఫిబ్రవరి 1వ తేదీన 23 ఏళ్ల సౌమ్యను రైల్లోంచి తోసివేసి ఆపై అత్యాచారం జరిపిన కేసులో గోవిందాచామి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో మరణశిక్షను రద్దుచేసి జీవితకాల శిక్షగా మార్చింది. దీనిపై కట్జు స్పందిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చట్టపరంగా జరిగిన తీవ్రమైన తప్పని ట్విట్టర్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. హత్యను నిర్వచించే ఐపిసి సెక్షన్ 300లో నాలుగు భాగాలు ఉన్నాయని, వాటిల్లో మొదటిది హత్య చేయాలన్న ఉద్దేశాన్ని నిర్వచిస్తుందని తెలిపారు. మిగిలిన మూడు విభాగాల్లో ఏ ఒక్కటి నిరూపణ కాకపోయినా- నిందితుడికి చంపాలన్న ఉద్దేశం లేకపోయినా అది హత్యగానే పరిగణించాలని స్పష్టం చేశారు. సెక్షన్ 300ను ఉన్నత న్యాయస్థానం సరిగా పరిశీలించకపోవడం చింతించాల్సిన అంశమని, ఈ తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరముందని కట్జు పేర్కొన్నారు.
ఎయిమ్స్ మహిళా
డాక్టర్ ఆత్మహత్య
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఎయిమ్స్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ రీతూ బంగోటి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు ఢిల్లీలో ఐపి ఎక్స్‌టెన్షన్‌లోని కుర్మాంచల్ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో విషపదార్థం తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్తతో విభేదాల కారణంగానే రీతూ ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడేవారని ఇరుగుపొరుగువారు సైతం పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలంలో స్యూసైడ్ నోట్ లభ్యమైందనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ముప్ఫయ్యేళ్ల రీతూకు మూడేళ్ల క్రితం వివాహం కాగా, రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. కాగా, రీతూ భర్త బ్రజేష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.