జాతీయ వార్తలు

పార్లమెంటు నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దాదాపు నెల రోజుల పాటు గొడవ, గందరగోళం మధ్య కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ్యుల గొడవ, గందరగోళం మూలంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు దాదాపుగా వృథా అయ్యాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పకనే చెప్పారు. సభ్యులు హుందాగా వ్యవహరించటంతో పాటు సభను సజావుగా నడిపించటం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి కానీ ఇలా సభా కార్యక్రమాలను స్తంభింపజేయకూడదని సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీ హితవు చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆఖరు రోజు కూడా ప్రతిపక్షాలు ఉభయ సభల్లో గొడవ చేశాయి. రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు ఒకసారి వాకౌట్ చేశారు. నెల రోజుల పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల చివరన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను కూడా తప్పుపట్టి చరిత్ర సృష్టించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ మేరకు సుమిత్రా మహాజన్ నిన్న లోక్‌సభలో తాను చేసిన ఒక వ్యాఖ్యను ఉపసంహరించుకోవటంతో పాటు కాంగ్రెస్ సభ్యులకు బాధ కలిగించిన పక్షంలో విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పవలసి వచ్చింది. సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టటాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ సభ్యులు దాదాపు నెల రోజుల పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయటంతో పాటు చివరకు స్పీకర్‌తో కూడా గొడవ పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభకు తల్లిలాంటి స్పీకర్‌తో గొడవ పడుతున్నారని ఆయన విమర్శించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వీడ్కోలు ప్రసంగం చేస్తూ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బాధ్యత గల ఎంపీలుగా వ్యవహరించాలని చురక పెట్టారు. ఏదైనా అంశంపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే పార్లమెంటరీ ప్రక్రియకు లోబడి బలంగా నిరసన తెలపాలన్నారు. పార్లమెంటరీ ప్రక్రియకు భిన్నంగా వ్యవహరించటం మంచిది కాదని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు. పార్లమెంటులో పార్లమెంటరీ పనులు వీలున్నంత ఎక్కువ జరిగేలా చూడవలసిన బాధ్యత సభ్యులపై ఉన్నదని మహాజన్ సూచించారు. సభలో వీలున్నంత తక్కువ గొడవ జరిగేలా చూడాలని ఆమె సూచించటంతో పాటు బాధ్యత గల ఎంపీలుగా తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నించాలని చెప్పారు.
రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కూడా సభ్యులకు ఇలాంటి సలహానే ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్య సభ సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల నుండి కొన్ని బిల్లులను ఆమోదించటం ద్వారా కొంత పని చేసినందుకు ఆయన సభ్యులను అభినందించారు. సభ్యులు గొడవకు ప్రాధాన్యత ఇవ్వకుండా చర్చలపై దృష్టి పెట్టాలని అన్సారీ హితవు చెప్పారు. గత నెల 26న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం నుండి గొడవలో పడిపోయాయి. మొదటి రెండు రోజులు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌పై చర్చ జరిపారు. ఆ తరువాత ఉభయ సభల సమావేశాలు ఏ రోజు కూడా సజావుగా జరగలేదు. కాంగ్రెస్‌తో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు మొదటి రెండు వారాల పాటు లోక్‌సభను దాదాపుగా స్తంభింపజేశాయి. ఆ తరువాత కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో పాటు జీరో అవర్‌లో కొద్ది సేపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కావలసిందేనంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించినందుకు నిరసనగా ఉభయ సభలను స్తంభింపజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఉభయ సభల్లో పెద్ద ఎత్తున గొడవ చేశాయి. రాజ్యసభ ఆఖరు మూడు రోజులు మధ్యాహ్నం తరువాత పని చేసినా అంతకు ముందు మాత్రం ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేకపోయింది. కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఉభయ సభలను స్తంభింపజేశారు. అధికార, ప్రతిపక్షానికి కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఇరవై సార్లు సమావేశమై పదమూడు బిల్లులను ఆమోదించిందని మహాజన్ చెప్పారు.
chitram...
బుధవారం పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ.
ఆయన ప్రసంగాన్ని ఆలకిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కమల్ నాథ్, ఎంపీలు