జాతీయ వార్తలు

ఆర్నెల్లు చాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ‘‘మాకు ఆరు నెలలు సమయమివ్వండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలు లేకుండా తుడిచిపెట్టేస్తాం. ఉగ్రమూకల వౌలిక నిర్మాణాలను నామరూపాలు లేకుండా చేస్తాం’’ అని భారత సైన్యం దేశ నాయకత్వానికి స్పష్టం చేసింది. సైనిక పదాతి దళాలకు చెందిన ఉన్నతస్థాయి ఇద్దరు మిలటరీ అధికారులు అనధికారికంగా ఈ విషయం వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి గత వారం లక్షిత దాడులు నిర్వహించి, వాటిని బహిర్గత పరిచిన తరువాత సైనిక దళాలు ప్రభుత్వానికి ఒక స్పష్టతనిచ్చాయి. ఈ దాడులు ఉగ్రవాదుల శక్తిసామర్థ్యాలకు నష్టం కలిగించలేవని, ఇందుకోసం మధ్యతరహా ప్రణాళిక అవసరమని ప్రభుత్వానికి సైనికాధికారులు తెలియజేశారు. అంతేకాదు, కాశ్మీర్‌లో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికే బారాముల్లాలో సైనిక క్యాంపుపై టెర్రరిస్టు దాడి జరిగిందని, వీటిని ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సీనియర్ సైనిక వ్యూహకర్తలు తెలిపారు. దీంతో పాటు వాస్తవాధీన రేఖకు ఆవల మరికొన్ని లక్షిత దాడులు చేయాల్సిన అవసరం ఉందని కూడా సర్కారుకు వారు వెల్లడించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యవస్థను నష్టపరచటానికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని వారన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మొత్తం 50 లాంచ్‌పాడ్‌లు, 200మంది ఉగ్రవాదులు ఉన్నారని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ‘‘ఇప్పుడు మనం చేపట్టిన చర్య స్థిరంగా కొనసాగాలి. ప్రస్తుతం ఉగ్రవాద నెట్‌వర్క్ ఒకడుగు వెనకకు వేసి ఉంది. మనం నిజంగా ఏదైనా సాధించాలంటే, కనీసం ఆరు నెలల ప్రణాళికతో ముందుకు పోవాలి. ఏదో ఒక్క ఘటనతో వాళ్లను మనం వాళ్లను దెబ్బ తీయలేం’’ అని వారన్నారు. భారత లక్షిత దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్ర సంస్థలు పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులను దేశంలోకి పంపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పిఓకేలో మరిన్ని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లు ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. లక్షిత దాడుల అనంతరం సరిహద్దుల్లో రక్షణ చర్యలతో పాటు, కాశ్మీర్ లోయలో ప్రశాంతత, ప్రజల్లో విశ్వసనీయత పాదుగొల్పే చర్యలు చేపట్టడం అత్యవసరమని ఆర్మీ అధికారులు తెలిపారు.