జాతీయ వార్తలు

గుజరాత్ తీరంలో మరో పాక్ పడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 5: వారం రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్‌కు చెందిన మరో పడవను బుధవారం గుజరాత్ తీరంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ఒక పాకిస్తాన్ పడవను బిఎస్‌ఎఫ్ అదుపులోకి తీసకున్న విషయం తెలిసిందే. గుజరాత్‌కు, పాకిస్తాన్‌లో సింధ్ రాష్ట్రానికి మధ్య గల వివాదాస్పద జలాలయిన సర్ క్రీక్‌లో తాజా పడవను బిఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత జలాల్లో చేపలు పడుతున్న ఒక కర్రతో తయారు చేసిన పడవను బిఎస్‌ఎఫ్ అధికారులు గమనించారు. వెంటనే వెంటాడి పడవను స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులో ఉన్న తొమ్మిది పాకిస్తాన్‌కు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పడవలోని చేపల వేటకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నిస్తున్నట్టు ఒక బిఎస్‌ఎఫ్ అధికారి చెప్పారు. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో భారత్ సైన్యం లక్షిత దాడులు జరిపిన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిన భారత్ ఈ పడవను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 2వ తేదీన భారత తీర రక్షక దళానికి చెందిన నౌక ‘సముద్ర పవక్’ గుజరాత్ తీరంలోనే పాకిస్తాన్‌కు చెందిన తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ఒక పడవను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తరువాత రెండు రోజులకే ఈ నెల 4న బిఎస్‌ఎఫ్ సిబ్బంది పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వదలివేసిన పాకిస్తాన్‌కు చెందిన ఒక పడవను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పడవలో అనుమానిత వస్తువులేమీ లేవని దానిని తనిఖీ చేసిన అనంతరం అధికారులు ప్రకటించారు. బహుశా అది గుజరాత్ తీరానికి కొట్టుకొని వచ్చి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచి తలెత్తే ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కోవడానికి భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి.