జాతీయ వార్తలు

రాహుల్ నిర్బంధం.. సిఎం కేజ్రీ కట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ వ్యవహారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బుధవారం ఢిల్లీలో ఆనూహ్యమైన రీతిలో రాజకీయ హై డ్రామాకు తెరతీసింది. మాజీ సైనికుడి మరణానికి కేంద్రంలోని మోదీ సర్కారే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. రాష్ట్ర పోలీసులు రెండుసార్లు రాహుల్‌గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేజ్రీవాల్ కదలికలను కూడా నియంత్రించారు. ఈ అంశంపై విరుచుకు పడ్డ పలువురు కాంగ్రెస్ నేతల్ని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోదియా, ఇతర ఆప్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల చర్య మోదీ సర్కార్ అప్రజాస్వామిక మనస్తత్వానికి నిదర్శనమని రాహుల్ నిప్పులు చెరిగారు. ఒఆర్‌ఓపి అంశంపై మోదీ ప్రభుత్వం అబద్ధాలు, మోసాలతోనే కాలక్షేపం చేస్తోందంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. హర్యానాలోని భివాణి జిల్లాకు చెందిన 70ఏళ్ల రామ్ కిషన్ గ్రేవల్ అనే మాజీ సైనికుడు జన్‌పథ్‌లోని ఓ ప్రభుత్వ భవన లాన్స్‌లో మంగళవారం విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కాంగ్రెస్, ఆప్ నేతలు నిరసనలకు దిగారు. తన నిరసనలను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు అనూహ్య రీతిలో గూండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీని మొదట మందిర్ మార్గ్ వద్ద తర్వాత పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద నిర్బంధించారు. తర్వాత ఆయన్ని తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శన జరపడంతో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాహుల్‌ను వదిలిపెట్టారు.కాగా,మృతుడి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కదలికల్ని కట్టడి చేశారు. మృతుడి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గ్రేవల్ కుమారుడు జశ్వంత్ కూడా ఉన్నాడు. గ్రేవల్ మృత దేహాన్ని ఉంచిన ఆర్‌ఎమ్‌ఎల్ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తమపై పోలీసులు చేయిచేసుకున్నారని వారు ఆరోపించారు. మృతుడి కుమారుడ్ని ఎలా అరెస్టు చేస్తారు..అందుకు మీరు సిగ్గు పడటం లేదా అంటూ ఆసుపత్రి వద్దే పోలీసులపై రాహుల్ గాంధీ కనె్నర్ర చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని వదిలేయాలంటూ రాహుల్ చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన రాహుల్ మృతుడి కుటుంబానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ త్యాగధనుడి కుటుంబానే్న కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఇదే నరేంద్ర మోదీ భారత దేశమని అన్నారు. కాగా, నిరసనల్లో పాల్గొన్న సుర్జేవాలా, జ్యోతిరాదిత్య, కుమారి సెల్జా సహా అనేక మంది కాంగ్రెస్ నేతల్ని కూడా పోలీసులు నిర్బంధించారు. కొందరు ఆప్ కార్యకర్తల్ని పోలీసులు ఈడ్చుకెళ్లినట్టుగా చెబుతున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి శిసోదియాను కొన్ని గంటల పాటు పోలీసు స్టేషన్‌లోనే ఉంచేశారు. తమపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యం, ప్రాధమిక హక్కులపై జరిగిన దాడిగా కాంగ్రెస్, ఆప్ నేతలు ఆరోపించారు.
ఓకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకాన్ని కేంద్రం అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని మాజీ రక్షణ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఆంటోనీ కేంద్రాన్ని హెచ్చరించారు. గ్రేవల్ మరణానికి బాధ్యత వహిస్తూ ఇటు జాతికి, అటు సైనికులకు ప్రధాని మోదీ క్షపాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒఆర్‌ఓపిని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి పారికర్‌లు చెబుతున్నా వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందని ఆంటోనీ అన్నారు. దీని కారణంగానే మాజీ సైనికుడు గ్రేవల్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కాగా, మాజీ సైనికుడి ఆత్మహత్యను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్, ఆప్ నేతలపై బిజెపి తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.

చిత్రం... రాహుల్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో తరలిస్తున్న దృశ్యం