జాతీయ వార్తలు

రూ.5వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి, నవంబర్ 2: దేశంలో ఎన్నడూలేని స్థాయిలో దాదాపు 5వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానీని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ శివార్లలో అతడికి చెందిన ఓ ఫార్మా ఫ్యాక్టరీపై దాడి చేసిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టరేట్ అధికారులు పెద్దమొత్తంలో నిషేధిత ‘మాండ్రాక్స్’, ‘ఎం.పిల్’ మాత్రలు, వాటి తయారీకి ఉపయోగించే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 2 కోట్ల మాండ్రాక్స్ మాత్రలు, దాదాపు 25 టన్నుల మేర, ప్యాకింగ్ చేసిన కార్టన్‌లు అక్కడ నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో మాండ్రాక్స్ మాత్రల విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ లెక్కన అధికారులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యం విలువ సుమారు 5వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. దేశ చరిత్రలో ఇంతపెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే ప్రధమం. దక్షిణాఫ్రికా, మొజాంబిక్ సహా పలుదేశాలకు తరలించేందుకు వీటిని సిద్ధం చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు చేశారు. వీటిని తయారు చేసిన ఫ్యాక్టరీ యజమాని దుధాని. కాగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరో వ్యక్తితోసహా నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశంలో ఈ డ్రగ్ (మాండ్రాక్స్)ను ఎక్కువగా వినియోగించే నగరం ముంబై. బటన్స్, పిల్స్, ఆకర్షణీయ రూపాల్లో ఉండే ఈ మాత్రలను సిగరెట్లు, హుక్కాలతో పొగతాగేటప్పుడు వినియోగిస్తారు. కొద్దిరోజులుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) అధికారులు నిఘావేసి ఈ దాడులు నిర్వహించారు. నిజానికి అక్టోబర్ 28న బిఎస్‌ఎఫ్ బలగాల పహరా మధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దాడులు చేసినప్పటికీ నిందితులనుంచి అదనపు సమాచారాన్ని రాబట్టాకే ఆ విషయం బయటకు వెల్లడించారు. రాజస్థాన్, గుజరాత్‌లో అనధికారికంగా నిర్వహిస్తున్న పలు ఫ్యాక్టరీలలో నిషేధిత మందులను తయారు చేస్తున్నారు. కాగా ఉదయ్‌పూర్ దాడి గురించి బుధవారం నాడు సిబిఇసి చైర్‌పర్సన్ నజీబ్‌షా వివరాలు తెలిపారు. ఇటీవలికాలంలో డిఆర్‌ఐ అధికారులు పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి 540 కిలోల హెరాయిన్, 7409 కిలోల ఎఫిడ్రిన్‌సహా పలు నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనుమతి లేకుండా నిషేధిత ఔషధాలను తయారు చేస్తున్న పది ఫ్యాక్టరీలను మూసివేయించామని తెలిపారు.