జాతీయ వార్తలు

తాత్కాలికంగా హైకమిషనర్లు వెనక్కి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 4: దౌత్య సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నారని భారత్, పాక్ దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్న కారణంగా ఈ పొరుగు దేశాల మధ్య తాజాగా దౌత్య సంబంధాలు మరింతగా దిగజారిన నేపథ్యంలో ఇరుదేశాలు కూడా తమ హైకమిషనర్లను తాత్కాలికంగా వెనక్కి పిలిపించడంతో పాటు ఇరు దేశాల్లోని తమ దౌత్యకార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవచ్చని పాక్ దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం పేర్కొంది. గత వారం న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్‌లో ఒక ఉద్యోగిని గూఢచర్యానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ప్రశ్నించడం కోసం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ తాజా వివాదం మొదలైంది. ఈ ఉదంతం రెండు దేశాలు తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి దారి తీయవచ్చని ఆ పత్రిక పేర్కొంది. రెండు దేశాలు కూడా పొరుగుదేశం దౌత్య కార్యాలయ సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో వీసా అఫీసర్‌గా పని చేస్తున్న మహమూద్ అఖ్తర్‌ను ఆ తర్వాత భారత ప్రభుత్వం దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించడం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు బెదిరించడం ద్వారా అఖ్తర్‌నుంచి తీసుకన్న స్టేట్‌మెంట్ ఆధారంగా భారత ప్రభుత్వం మరికొంతమంది పాకిస్తానీ దౌత్య సిబ్బందిని సైతం ఈ కేసులో ఇరికించింది. అంతేకాదు దాదాపు ఆరుగురు అధికారుల పేర్లను మీడియాకు లీక్ చేయడంతో వారి భద్రతకు ప్రమాదం ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారిని వెనక్కి పిలిపించాల్సి వచ్చింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రభుత్వంకూడా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయంలో పని చేస్తున్న ఎనిమిది మంది అధికారులు గూఢచార ఏజన్సీలయిన ఐబి, రా సంస్థలకు చెందిన వారని ప్రత్యారోపణ చేసింది. దీంతో భారత ప్రభుత్వం వారిని ఉపసంహరించుకోక తప్పలేదని ఆ పత్రిక తెలిపింది. అయితే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న వారి పేర్లను బైటపెట్టడం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అవగాహనను భారత ప్రభుత్వం ఉల్లంఘించిందని తాజా పరిణామాల గురించి బాగా తెలిసిన ఓ అధికారి చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. దౌత్య కార్యాలయాల్లో కొంతమంది అధికారులు గూఢచర్యం నెరపుతున్నారనే విషయం, అధికారులకు పూర్తిగా తెలిసే ఇది జరుగుతోందనే విషయం ఇరుపక్షాలకు తెలుసునని ఆ అధికారి తెలిపారు. అయితే భారత్ ఇలా చేస్తుందని ఎవరూ అనుకోలేదని ఆ అధికారి చెప్పారు. భారత్ చర్య రెండు దేశాలపైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. తాజా వివాదం కారణంగా రెండు దేశాలు కూడా తమ హైకమిషనర్లను ప్రస్తుతానికి ఉపసంహరించుకోవడానికి దారి తీయవచ్చని, అలాగే దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించుకోవడానికి కూడా ఇది దారి తీయవచ్చని ఆ అధికారి అభిప్రాయ పడ్డారు.

సిమీ ఉగ్రవాదుల
ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు ఆదేశం

భోపాల్, నవంబర్ 4: మధ్యప్రదేశ్‌లో జైలు నుంచి తప్పించుకున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు వివాదాస్పద రీతిలో హతమార్చిన ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ దర్యాప్తునకు ఆదేశించారని, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్‌కె.పాండే ఈ దర్యాప్తు నిర్వహిస్తారని గురువారం రాత్రి భోపాల్‌లో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు గల హైసెక్యూరిటీ జైలు నుంచి సిమీ ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారన్న విషయంతో పాటు ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ పాండే అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తారని ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించినదిగా చెబుతున్న ఆడియో టేపును కూడా ఈ దర్యాప్తు సందర్భంగా పరిశీలించడం జరుగుతుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజున సిమీ ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులకు, కంట్రోల్ రూములోని పోలీసు ఉన్నతాధికారులకు మధ్య సాగిన సంభాషణలతో కూడినదిగా చెబుతున్న ఈ ఆడియో టేపు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘సిమీ ఉగ్రవాదులను చుట్టుముట్టాం. వారిని హతమార్చి ఆట కట్టించాం’ అని పోలీసులు తమ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నట్లు ఈ ఆడియో టేపులో వినిపిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై సిఐడి అధికారులతో కూడిన ప్రత్యేక బృందం (సిట్)తో దర్యాప్తు జరిపిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించడంతో పాటు జైలు నుంచి సిమీ ఉగ్రవాదులు పరారైన ఘటనపై మాజీ డిజిపి నందన్ దూబేతో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. అయితే కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ రెండు ఘటనలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ శుక్రవారం వెల్లడించారు.