జాతీయ వార్తలు

స్పీకర్‌ను ఆదేశించగలమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరిన సుప్రీం కోర్టు బెంచ్

టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు బదిలీ కోర్టుల పరిధిలోకి స్పీకర్ రారు: ఏజీ వాదన
కాలయాపన భరించాల్సిందేనా?: పిటిషనర్ వాదన స్పీకర్లే పార్టీ ఫిరాయస్తున్నారు: బెంచ్ సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబర్ 8: తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం కోర్టులకు ఉన్నదా? లేదా? అనేది రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా శాసన సభ స్పీకర్‌ను ఆదేశించాలంటూ టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఇద్దరు న్యాయమూర్తులు అగర్వాల్, రోహింగ్టన్ నారిమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసును విచారిస్తూ, శాసన సభ స్పీకర్ అధికారాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉందో లేదోనన్న సందేహాన్ని నివృత్తి చేయాలని ఉన్నతస్థాయి రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరుతూ కేసును బదిలీ చేసింది. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ మదుసూదనాచారికి గతంలో జారీ చేసిన ఆదేశాన్నీ నిలిపివేసింది. టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై నవంబర్ 8లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించటం తెలిసిందే. స్పీకర్‌ను ఆదేశించే అధికారం సుప్రీం కోర్టుకు లేదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అటార్నీ జనరల్ ముకుల్ రొహిత్గీ మంగళవారం తమ వాదనలు వినిపించారు. న్యాయస్థానాల పరిధిలోకి స్పీకర్ రారు కనుక, ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని గట్టిగా వాదించారు. దీనికి ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ, స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టులకు ఉన్నదా? లేదా? అనేది రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని ప్రకటించారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టులు జోక్యం చేసుకోకుంటే, ఐదేళ్లపాటు నిర్ణయం లేకుండానే నడిపించేస్తారా? అంటూ సంపత్ తరఫు న్యాయవాది జంధ్యాల శంకర్ అడిగిన ప్రశ్నతో న్యాయమూర్తులు ఏకీభవించారు. స్పీకర్ తరఫున ముకుల్ రొహిత్గీ వాదనలు వినిపిస్తూ, ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిశీలనలో ఉన్నప్పుడు, వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించే వీల్లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న చర్యల అనంతరం, వాటిని మాత్రమే కోర్టుల్లో ప్రశ్నించేందుకు వీలుంటుందని గుర్తు చేశారు. రాష్ట్ర హైకోర్టు సైతం నిర్ణీత కాల పరిమితిలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదనేది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యేల అనర్హతల అంశంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా, దాన్ని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉండదన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఎలా చెప్పలేమో, అలాగే స్పీకర్‌ను కూడా కాలపరిమితిలో నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించలేమన్నారు. రాజ్యాంగంలోని 212 ఆర్టికల్ ప్రకారం న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలు స్పీకర్‌కూ ఉన్నాయన్నారు. రోహిత్గీ చేసిన వాదనతో ధర్మాసనం విభేదించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తూ కళ్లు మూసుకోలేమంటూ వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాల నేపథ్యంలో హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఆయనకు ఆదేశాలు జారీ చేయలేవని రోహిత్గీ మరోసారి వాదించారు. అలా జరిగితే, రాజ్యాంగబద్ధంగా స్పీకర్‌కు కల్పించిన అధికారాలకు విఘాతం కలలుగుతుందని, దీన్ని ఆసరా చేసుకుని చాలామంది పిటిషన్లు దాఖలు చేసే ప్రమాదం ఉందన్నారు. టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 2014లో ఫిర్యాదు చేస్తే, రెండున్నరేళ్లు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదని సంపత్ తరఫు న్యాయవాది శంకర్ వాదించారు. సుప్రీం కోర్టు నోటీసులను తీసుకునేందుకు కూడా స్పీకర్ నిరాకరించారన్నారు. స్పీకర్ తన నిర్ణయాన్ని పెండింగ్‌లోపెట్టి ఐదేళ్లు కాలయాపన చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవడం సమంజసమేనా అని శంకర్ వాదించారు. వాదనలపై ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ, ఇంతకాలం స్పీకర్ చర్య తీసుకోకపోవటం సమంజసం కాదని అభిప్రాయపడింది. స్పీకర్లే పార్టీలు ఫిరాయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం తమకు లేదని ద్విసభ్య ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభకు స్పీకర్ సుప్రీమే అయినా, జ్యుడీషియల్ అథారిటీ కాదని వ్యాఖ్యానించింది. అయితే, నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను తాము సైతం ఆదేశించలేమని న్యాయమూర్తులు వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226లోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టులకు ఉన్నాదా? లేదా? అనే అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని ప్రకటించారు. సమయ నిర్ణయంపై గతంలో స్పీకర్‌కు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలన్న రోహిత్గీ విజ్ఞప్తిని ద్విసభ్య ధర్మాసనం ఆమోదించింది.