జాతీయ వార్తలు

బ్యాంకులు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ముంబయి, నవంబర్ 10: దేశవ్యాప్తంగా గురువారం బ్యాంకులు పాత కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి వచ్చిన వేలాది మంది ప్రజలతో కిటకిటలాడాయి. ఏ బ్యాంకు శాఖ వద్ద చూసినా పొడవైన క్యూలైన్లలో నిలబడి ఉన్న ప్రజలే కనిపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమకు దగ్గరగా ఉన్న బ్యాంకుల బ్రాంచీలకు తరలిరావడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యాంకులతో పాటు ఎటిఎం కేంద్రాల వద్ద కూడా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో వాటిని బ్యాంకుల్లో సమర్పించి బదులుగా కొత్త నోట్లు పొందటానికి లేదా పాత నోట్లను తమ ఖాతాల్లో జమ చేయడానికి వేలాది మంది ప్రజలు గురువారం తమ దగ్గరలోని బ్యాంకు శాఖలకు లేదా తమ ఖాతాలున్న బ్యాంకు శాఖలకు చేరుకున్నారు. గురువారం పని దినం అయినప్పటికీ తమ కార్యాలయాలకు వెళ్లకుండా అనేక మంది ప్రజలు తమ వద్ద ఉన్న నిషిద్ధ పాత నోట్లను వదిలించుకునే ఆతృతతో ఉదయమే దేశవ్యాప్తంగా గల వివిధ బ్యాంకుల శాఖలు తెరవకముందే వాటిముందు గుమికూడారు. కొన్నిచోట్ల బ్యాంకులు తెరిచే సమయం కన్నా చాలా గంటల ముందే అక్కడికి చేరుకొని వేచిచూశారు. ఇలా బ్యాంకుల వద్దకు చేరుకున్న ప్రజల్లో సీనియర్ సిటిజన్లు కూడా చాలామంది ఉండటం విశేషం. బ్యాంకులు తెరిచిన తరువాత కూడా ఏ బ్యాంకు శాఖ వద్ద చూసినా గంటల తరబడి ప్రజలు క్యూలైన్లలో కనిపించారు. అనేకచోట్ల బ్యాంకులు తెరిచిన కొన్ని గంటల్లోనే కొత్తగా విడుదలయిన రూ.500, రూ.2,000 నోట్లు అయిపోయాయి. మరోవైపు పాత రూ.500, రూ.1,000 నోట్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు గురువారం వరకు కొత్త నోట్లు చేరుకోలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో 3,400 మంది పారా మిలిటరీ, ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు క్విక్ రియాక్షన్ టీమ్‌లను వివిధ బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల వద్ద మోహరించారు.
‘తమ వద్ద డబ్బు ఉన్నప్పటికీ స్థానిక దుకాణాలు, డిటిసి బస్సుల్లో తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడవలసిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ రోజు నేను విధులకు వెళ్లకుండా బ్యాంకుకు రావలసి వచ్చింది. ఈ పెద్ద వరుసలో ఇంకో మూడు నాలుగు గంటల వరకు నా వంతు రాదు’ అని ఢిల్లీలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుంకుం భార్గవ అన్నారు. ‘నల్లధనం ఉన్నవారు సమస్య నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం చూసుకుంటారు. చివరకు సతమతం అయ్యేది సామాన్యుడే. కనీస అవసరాలకు డబ్బు లేనందున ఇప్పుడు మేము క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది’ అని టిసిఎస్ ఉద్యోగి కునాల్ భరద్వాజ్ వాపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒక బ్యాంకు ముందు పెద్దఎత్తున వచ్చిన ప్రజల వల్ల తోపులాట కూడా జరిగింది.
ముంబయిలో ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బ్యాంకుల ముందు గుమికూడారు. అంటే బ్యాంకులు తెరవడానికి మూడు, నాలుగు గంటల ముందే అక్కడికి చేరుకున్నారు. అనేక బ్యాంకు శాఖల వద్దకు అసాధారణ స్థాయిలో ప్రజలు తరలివచ్చారని, దీంతో శాంతిభద్రతల నిర్వహణకు తాము పోలీసుల సహాయం కోరామని అనేక బ్యాంకుల అధికారులు చెప్పారు.

చిత్రం... పాత నోట్లను మార్చుకునేందుకు గురువారం ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు వద్ద బారులుతీరిన జనం