జాతీయ వార్తలు

బిచ్చగాళ్లను చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య నియంతల తరహాలో మోదీ నిర్ణయాలు
మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరో చెప్పండి రాజకీయ స్వప్రయోజనాలకే ఈ చర్య
85 శాతం కరెన్సీ చెల్లదంటే ఏమైపోవాలి? ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే యత్నమా?
నల్లధనం నిర్మూలనకు కట్టుబడే ఉన్నాం రాజ్యసభలో దుమ్మెత్తిపోసిన విపక్షాలు

న్యూఢిల్లీ, నవంబర్ 16: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యేనని విపక్షం అభివర్ణించింది. కల్నల్ గఢాఫి, హిట్లర్, ముస్సోలిని నియంతల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో చెలామణిలోవున్న 15 లక్షల కోట్ల కరెన్సీ నుంచి ఒక్క నిర్ణయంతో 85 శాతం కరెన్సీ పనికిరాకుండా చేసేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజానీకం ఏమైపోతాయని కాంగ్రెస్, వామపక్షాలు, జెడి (యు), ఆర్‌జెడి, సమాజ్‌వాదీ తదితర పక్షాలు మోదీ సర్కారును రాజ్యసభలో నిలదీశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాల మేరకు పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టారు. పెద్దనోట్లను రద్దు చేయటంతో ప్రజలు ఎదుర్కొనే కష్టాలను పరిష్కరించేందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం కేంద్రాన్ని నిలదీసింది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని పూర్తిగా అదుపు చేయటం, అవినీతిని అరికట్టటం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయగలిగామంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు అసలు లక్ష్యాన్ని సాధించకలేకపోయిందని విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ, బిజెపి అధినాయకులు నోట్ల రద్దు గురించి కొందరికి ముందే లీక్ చేశారని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం సాధించుకునేందుకే తప్ప దేశ ప్రయోజనాల కోసం నోట్ల రద్దు జరగలేదని ప్రతిపక్షం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పెద్ద నోట్లను రద్దు చేసినందుకు తనను కొందరు సజీవంగా కాల్చివేసే ప్రమాదం ఉందంటూ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను ప్రతిపక్షం తీవ్రంగా ఖండించింది. సజీవంగా దహనం చేయాలనుకుంటున్న వారి పేర్లు వెల్లడించాలని ప్రతిపక్షాలు ప్రధాన మోదీకి సవాల్ చేశాయి. ఎన్డీయే తీసుకున్న తొందరపాటు చర్య వల్ల దేశంలోని కోట్లాది పేదలు నానా కష్టాలు పడుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. నల్లధనం నియంత్రణ, అవినీతిని నిర్మూలనకు అంతా కట్టుబడే ఉన్నామని, సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిందేనని ప్రతిపక్షం గట్టిగా స్పష్టం చేసింది. కానీ, అవినీతిని అరికట్టే ముసుగులో రాజకీయ ప్రయోజనాల సాధనకు ప్రయత్నించటం, పేదలను కష్టాలకు గురిచేయటాన్ని తాము ఎంతమాత్రం సహించేది లేదని ప్రతిపక్షం స్పష్టం చేసింది.
రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చను కాంగ్రెస్‌పక్ష ఉపనాయకుడు ఆనంద్ శర్మ ప్రారంభించారు. మోదీ అనౌచిత్య నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజల వద్ద ఉన్న డబ్బంతా నల్ల ధనమేనా? అని నిలదీశారు. ఆకస్మిక కఠిన నిర్ణయంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వద్ద చిన్న చిన్న వస్తువులు కొనేందుకు కూడా డబ్బులేకుండా చేశారని ఆనంద్ శర్మ విమర్శలు గుప్పించారు. మీరు సమర్థులైతే ఏటిఎంలు ఎందుకు పనిచేయటం లేదని కేంద్రాన్ని నిలదీశారు. నగదురహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు అసాధ్యమని స్పష్టం చేశారు. స్పష్టతలేని నిర్ణయం వల్ల డబ్బుకోసం ప్రజలు గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు. ప్రజలు తమ డబ్బును తాము తీసుకునేందుకు ఇంత కష్టపడాలా? అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంత అదుపులోకి వచ్చిందని ప్రశ్నించారు. రెండు వేల నోట్లు విడుదల చేసి అవినీతిని అరికడకతారా? అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతమని సమాజ్‌వాదీ పార్టీ పక్షం నాయకుడు రాంగోపాల్ యాదవ్ అన్నారు. సగటు మనిషి డబ్బులున్నా అడుక్కుతినే వాడయ్యాడని ఆయన వాపోయారు. ప్రభుత్వ నిర్ణయం మూలంగా దేశంలోని కోట్లాది ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని సిపిఎం అధినాయకుడు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ‘నల్లధనం ఇళ్లలో ఉండదు. నల్లధనం ఎప్పటికప్పుడు ఇతర రూపాల్లోకి వెళ్లిపోతుందని’ అని ఆయన స్పష్టం చేశారు. చిన్న చేపలు కష్టాలుపడుతుంటే మొసళ్లు సంతోషంగా ఉన్నాయని ఏచూరి వ్యంగ్య విమర్శనాస్త్రాలు సంధించారు.

చిత్రం... రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ