జాతీయ వార్తలు

బాలమురళి వాయులీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 23:దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రతిరూపంగా, కొత్త సంగీత ప్రక్రియల ప్రయోక్తగా రాణించి కోటానుకోట్ల మందిని అలరించిన గాన గంధర్వుడు బాల మురళీ కృష్ణకు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఆయన భౌతిక కాయానికి వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య బుధవారం ఇక్కడి బీసెంట్‌నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్య క్రియలు జరిగాయి. వందలాదిగా సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు బాలమురళి భౌతిక కాయాన్ని సందర్శించి తుది నివాళులర్పించారు. పద్మ విభూషణ్ సహా ఎన్నో సమున్నత పురస్కారాలు అందుకున్న 86ఏళ్ల బాలమురళి మంగళవారం చెన్నైలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. దశాబ్దాలుగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ నెమరువేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కర్నాటక సంగీత విద్వాంసుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, సినీ గాయకుడిగా తనదైన విశిష్టముద్రను వేసిన బాలమురళి నిర్యాణం సంగీత ప్రపంచానికి తీరనిలోటని, అది ఎప్పటికీ, ఎన్నటికీ పూడ్చలేనిదేనంటూ పలువురు ఆయన ప్రజ్ఞాపాటవాలను, విశిష్ట వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ గాయకుడు జేసుదాసు, నటుడు కమల్‌హసన్ సహా ఎందరో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. 1959లో త్రిపోనితిరాలోని సంగీత అకాడమీలో చదువుకుంటున్న సమయంలోనే ఓ కచేరీకోసం ఎర్నాకుళం వచ్చిన బాలమురళిని తాను తొలిసారిగా కలుసుకున్నానని జేసుదాస్ తెలిపారు. తమ సంగీత అకాడమీకి కూడా వచ్చి పాడాలని అడిగిన వెంటనే ఆయన కాదనకుండా అంగీకరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని చెప్పారు. ‘మామూలుగా అయితే ఆ స్థాయి వ్యక్తులు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు. కానీ బాలమురళి తీరే వేరు. మేము అడిగిన వెంటనే అలాగే..వస్తా’నంటూ చిరునవ్వుతో చెప్పారని జేసుదాస్ గుర్తు చేసుకున్నారు. బాలమురళి సంగీత పరిజ్ఞానం ముందు తాము ఎందుకూ పనికిరామని పేర్కొన్న కర్నాటక సంగీతానికి ఆయన లేనిలోటు తీరనిదేనన్నారు. బాలమురళిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని, భావి సంగీత విద్యార్థులు ఆయన అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. బాలమురళితో సరితూగగల సంగీత సామర్థ్యం ఎవరికీ లేదని కమల్‌హసన్ అన్నారు. ఆయన తనకు తెలియడం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

చిత్రం... బాలమురళి పార్థివ దేహాన్ని సందర్శించి బంధువులను పరామర్శిస్తున్న కమల్‌హాసన్