జాతీయ వార్తలు

పాక్‌లోకి వృథాగా పోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భటిండా, నవంబర్ 25: సట్లెజ్, బియాస్, రవి నదుల జలాలపై భారత్‌కే హక్కు ఉందని, అందువల్ల ఈ జలాలను వృథాగా పాకిస్తాన్‌లోకి పోనివ్వకుండా నిలిపివేస్తామని, ఇక్కడి రైతులే ఉపయోగించుకునేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సింధూ జలాల ఒప్పందం- సట్లెజ్, బియాస్, రవి- ఈ నదులలోని జలాలు భారత్‌కు, మన రైతులకే చెందుతాయి. ఈ నీటిని పాకిస్తాన్ పంట పొలాల్లో ఉపయోగించుకోవడం లేదు. అయితే పాకిస్తాన్ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ నీటిలో ప్రతి బొట్టును నిలిపివేసి, పంజాబ్, జమ్మూకాశ్మీర్, భారత రైతాంగానికి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పని చేయడానికి నేను నిబద్ధుడినై ఉన్నాను’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అన్నారు. సట్లెజ్, బియాస్, రవి నదులలోని ప్రతి నీటి బొట్టును పంజాబ్, జమ్మూకాశ్మీర్ రైతులకు అందించేందుకు వీలుగా ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన వెల్లడించారు. ‘మీ పంట పొలాలకు ఈ నీటిని అందించి మీ అవసరాలు తీర్చడానికి మీ ఆశీస్సులు నాకు అవసరం’ అని మోదీ రైతులను ఉద్దేశించి అన్నారు. పంజాబ్ రైతులకు తగినంత నీరు అందితే వారు మట్టిలో బంగారం పండిస్తారని, దేశ ఖజానాను నింపుతారని మోదీ అన్నారు.
నష్టపోతున్న పాకిస్తాన్
భారత్‌కు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా పాకిస్తాన్ తనను తాను ధ్వంసం చేసుకుంటోందని, నష్టపోతోందని, అమాయకులను హతమారుస్తోందని మోదీ అన్నారు. భటిండాలో ఎయిమ్స్ భవన నిర్మాణానికి శుక్రవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రజలు కూడా పేదరికం నుంచి విముక్తి కోరుకుంటున్నారని, అయితే ఆ దేశ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ హింసాత్మక పరిస్థితులను సృష్టించారని ఆరోపించారు
మొబైల్ బ్యాంకింగ్‌కు మళ్లండి
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడటానికి మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. అవినీతిని అరికట్టడానికి, నల్లధనాన్ని నిర్మూలించడానికి బ్యాంకు శాఖల్లాగా పనిచేసే మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని, మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లింపులు చేయాలని ఆయన కోరారు. దేశంలో ఉన్న మొత్తం కుటుంబాల కన్నా నాలుగింతలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌పై ప్రజలకు శిక్షణ ఇవ్వాలని ఆయన రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, యువతను కోరారు. అవినీతి, నల్లధనం మూలంగా మధ్య తరగతి ప్రజలు దోపిడీకి గురయ్యారని, పేద ప్రజలు హక్కులు కోల్పోయారని మోదీ అన్నారు. పేద ప్రజలు కోల్పోయిన హక్కులను అందించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

chitram...
భటిండాలో శుక్రవారం ఎయమ్స్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభా వేదికపై
ప్రధాని నరేంద్ర మోదీకి కృపాణం బహూకరిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.