జాతీయ వార్తలు

పరిధి దాటొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ విభాగాలు ‘లక్ష్మణ రేఖ’కు లోబడే ఉండాలి
వాటిని కనిపెట్టాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది
చట్టాలు, ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండొద్దు
ఉంటే.. న్యాయ వ్యవస్థ సహించదు: సిజెఐ ఠాకూర్

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రభుత్వంలోని ఏ అంగం కూడా ‘లక్ష్మణ రేఖ’ను దాటకూడదని పేర్కొంటూ, అన్ని అంగాలు వాటి పరిధుల్లో పనిచేసేట్లుగా కనిపెడుతూ ఉండే బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఇచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సుప్రీంకోర్టు లాన్స్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా లేదా రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను అతిక్రమించినా ఆ చట్టాన్ని తోసిపుచ్చే హక్కు న్యాయ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఏయే పనులు చేయాలో రాజ్యాంగం మాకు చెప్పింది. అది న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలకు విధులను, బాధ్యతలను నిర్దేశించింది. అది ఆయా వ్యవస్థలకు పరిధులను, ‘లక్ష్మణ రేఖ’లను విధించింది. ‘ఏ వ్యవస్థ కూడా తన పరిధిని అతిక్రమించకుండా కనిపెడుతూ ఉండే బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఇచ్చింది. పార్లమెంటుకు చట్టాలను రూపొందించే అధికారం, హక్కు ఉంది. అయితే రాజ్యాంగం విధించిన పరిధికి లోబడే మాత్రమే పార్లమెంటు ఆ పనిచేసి తీరాలి. ఒకవేళ పార్లమెంటు రాజ్యాంగం విధించిన పరిమితిని అతిక్రమించి చట్టం చేసినా లేదా ఆ చట్టం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉన్నా సదరు చట్టం సరిగా లేదని, తప్పుగా ఉందని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంది’ అని జస్టిస్ ఠాకూర్ స్పష్టం చేశారు. ‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులను అయినా ‘రూల్ ఆఫ్ లా’ను కాపాడేందుకు న్యాయ వ్యవస్థ కొట్టివేయగలదు’ అని ఆయన వివరించారు. నవంబర్ 26ను గతంలో ‘లా దినోత్సవం’గా నిర్వహించేవారు. అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26ను ‘లా దినోత్సవం’ కన్నా ‘రాజ్యాంగ దినోత్సవం’గా నిర్వహించుకోవడమే సముచితమని జస్టిస్ ఠాకూర్ అన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం ఉందని అన్నారు. భారత రాజ్యాంగంలో సంపన్నులు, పేదలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకపోవడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చన్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ రాజ్యాంగంలోని సున్నిత సమతుల్యతకు 1970లలో భంగం వాటిల్లిందని పేర్కొంటూ ఆ సమతుల్యతను పునరుద్ధరించి తీరాలని సూచించారు.