జాతీయ వార్తలు

నభా జైలుపై సాయుధ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటియాలా, నవంబర్ 27: పంజాబ్‌లో ఆదివారం సాయుధ దుండగులు హై-సెక్యూరిటీ జైలుపై దాడికి పాల్పడి సంచలనం సృష్టించారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన వీరు పటియాలా సమీపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన నభా జైలును బద్దలు కొట్టి పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) అధినేత హర్మీందర్ మింటూ సహా ఐదుగురు ఖైదీలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డిజి)ని సస్పెండ్ చేయడంతో పాటు ఆ జైలులో పనిచేస్తున్న మరో ఇద్దరు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసింది. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయన్న విషయం స్పష్టమవుతోందని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉగ్రవాదం మళ్లీ పుంజుకోవచ్చని ప్రజలు భయాందోళన చెందుతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పోలీసు దుస్తుల్లో వచ్చిన కొంత మంది యువకులు నభా జైలును ముట్టడించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని, ఈ సందర్భంగా కరడు గట్టిన ఒక ఉగ్రవాది సహా ఐదుగురు ఖైదీలు జైలు నుంచి పరారయ్యారని పోలీసులు వివరించారు. పరారైన ఖైదీల్లో కెఎల్‌ఎఫ్ అధినేత హర్మీందర్ మింటూతో పాటు గ్యాంగ్‌స్టర్ వికీ గౌందర్, గుర్‌ప్రీత్ సెఖోన్, నితా డియోల్, విక్రమ్‌జీత్ ఉన్నారని వారు తెలిపారు. పంజాబ్ పోలీసులు రెండేళ్ల క్రితం మింటూను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సిర్సాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై 2008లో జరిగిన దాడి, 2010లో హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు పదార్ధాల స్వాధీనం సహా పది కేసుల్లో మింటూ నిందితుడిగా ఉండటంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఇప్పుడు మింటూ సహా ఐదుగురు ఖైదీలు నభా జైలు నుంచి పారిపోవడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై-అలర్ట్ ప్రకటించి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు సహా ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్వేష్ కౌశల్ సహా ఇతర సీనియర్ అధికారులతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జైళ్ల శాఖ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు నభా జైలు సూపరింటెండెంట్, డిప్యుటీ సూపరింటెండెంట్‌లను డిస్మిస్ చేసి పరారైన ఖైదీల కోసం గాలింపు మొదలు పెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం శాఖ మంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు జైలుపై దుండగుల దాడి వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అంశాన్ని అలాగే జైలులో లోపాలేమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలించేందుకు అదనపు డిజిపి ర్యాంకు అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరినట్లు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వివరించారు. అలాగే ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా హోం శాఖ కార్యదర్శిని కూడా కోరామని, ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
‘నభా’ ఘటనపై నివేదిక: కేంద్రం ఆదేశం
పంజాబ్‌లోని పటియాలాలో ఆదివారం సాయుధ దుండగులు నభా జైలును బద్ధలు కొట్టి కరడు గట్టిన ఉగ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) అధినేత హర్మీందర్ మింటూ సహా ఐదుగురు ఖైదీలతో పరారైన ఉదంతం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నభా జైలుపై దుండగులు దాడికి తెగబడ్డారన్న సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఫోను ద్వారా పంజాబ్ డిజిపితో మాట్లాడి రాష్ట్రంలోని ఇతర జైళ్లలో తగిన భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో పంజాబ్, మరో నాలుగు రాష్ట్రాల శాసనసభలకు జరుగనున్న ఎన్నికల సందర్భంగా విషపూరితమైన రాజకీయ ప్రచారం లేదా విదేశీ ఉగ్రవాద శక్తుల ద్వారా శాంతికి భంగం కలిగించేందుకు జరిగే ప్రయత్నాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భద్రతా బలగాలకు సూచించిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది.

చిత్రం... దుండగులు దాడికి పాల్పడిన నభా జైలు లోపల పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు