జాతీయ వార్తలు

శశికళకు లైన్‌క్లియర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 10: దివంగత తమిళనాడు సిఎం జయలలిత అనుంగు నెచ్చెలి శశికళ అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పురచ్చితలైవి (జయలలిత) చూపిన బాటలో పార్టీని ముందుకు నడిపించాలని అన్నాడిఎంకె సీనియర్ నేతలు శశికళను కోరినట్టు సమాచారం. అన్నాడిఎంకె పధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్నట్టుగా వార్తలు వచ్చిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై. అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మన్ ఇ మధుసూదన్ నేతృత్వంలో పార్టీ నేతల బృందం ఒకటి శనివారం శశికళను పొయెస్ గార్డెన్‌లో ఆమెతో సమావేశమై ఈమేరకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అమ్మ తర్వాత చిన్నమ్మే మాకు నాయకురాలని, ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని, ఆమే పార్టీకి నాయకత్వం వహించి జయ అడుగుజాడల్లో పార్టీని నడిపించాలని తామంతా కోరుకుంటున్నట్టు తంబిదురై జయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు.
జయలలిత మృతిచెందినప్పటి నుంచీ సిఎం పన్నీర్ సెల్వంతో సహా తమిళనాడు సీనియర్ మంత్రులు తరచూ జయ అధికార నివాసమైన పొయెస్ గార్డెన్‌లోనే ఉంటున్న శశికళ వద్దకు వెళ్లి సమాలోచనలు జరుపుతోన్న విషయం తెలిసిందే. జయ అంత్యక్రియల సమయంలో సైతం శశికళ అన్నీ తానై వ్యవహరించిన విషయం విధితమే. అంత్యక్రియలకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీలాంటి ప్రముఖ నేతలు సైతం శశికళను ఓదార్చారు. ఇవన్నీచూస్తే శశికళ పార్టీలోకానీ, ప్రభుత్వంలోకానీ ముఖ్య భూమిక పోషించడం ఖాయంగా కనిపిస్తోందని గత కొద్ది రోజులుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా, 27 ఏళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన జయలలిత స్థానంలో సమర్థులైన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడానికి పార్టీ త్వరలోనే సమావేశం కానుందని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు సి పొన్నయ్యన్ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాకు వెల్లడించారు. శశికళను పార్టీ నేతలంతా కలవడం గురించి మీడియా ప్రశ్నించగా అందులో తప్పేముందని పొన్నయ్యన్ ఎదురు ప్రశ్నించారు. శశికళ పార్టీలో ముఖ్య నాయుకురాలని, అలాంటి వ్యక్తిని ఎవరైనా కలవడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా సంఘటితంగా ఉందని కూడా పొన్నయ్యన్ స్పష్టం చేశారు. కోటిన్నర మంది కార్యకర్తలు నిర్మించిన పార్టీ తమదని, ‘అమ్మ’ దీన్ని ఒక కోటలా పటిష్ఠంగా తయారు చేశారన్నారు. కాగా, అన్నాడిఎంకె నేతృత్వంలోని ప్రభుత్వం, పార్టీ వేర్వేరని, ప్రభుత్వానికి పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తున్నారని, ఎన్నికైన వ్యవస్థల నేతృత్వంలో పార్టీ నడవనుందని చెప్పారు. కాగా పార్టీలో శశికళ భర్త నటరాజన్, ఇతర కుటుంబీకుల పాత్ర గురించి మీడియా ప్రశ్నించగా ఇది అనవసరమైన ప్రశ్న అని, పార్టీకి కార్యకర్తలే నేతలని పొన్నయ్యన్ చెప్పారు. ఇదిలావుంటే, పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉండాలని శశికళ తన కుటుంబీకులు, బంధువులకు స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, వారి ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులకు, సీనియర్ అధికారులకు కూడా ఆమె స్పష్టం చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి తాను పొయెస్ గార్డెన్‌లోనే కొనసాగుతానని కూడా ఆమె వారికి చెప్పారని అంటున్నారు. కాగా, జయలలిత మృతి చెందిన తర్వాత తొలిసారిగా శనివారం తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు మెరీనా బీచ్‌లోని ఎంజిఆర్ స్మారక కాంప్లెక్స్‌లోని జయలలిత సమాధి వద్దకెళ్లి నివాళి అర్పించారు. జయ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెను ఎవరూ కలవనీయకుండా చేశారని శశికళపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నట్టు వచ్చిన కథనాల గురించి అడగ్గా, ఇవన్నీ పుకార్లు మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని పొన్నయ్యన్ కొట్టిపారేశారు. జయ మృతి తర్వాత పార్టీలో శూన్యం నెలకొందన్న కథనాలపై స్పందిస్తూ, ఎంజిఆర్, అమ్మ (జయ) ఆత్మలు పార్టీని కాపాడుతున్నంతకాలం శూన్యానికి అవకాశమే ఉండదని వ్యాఖ్యానించారు.
వీలునామాపై వౌనం
కాగా, దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి జయలలిత ఏదయినా వీలునామా రాశారా? అన్న ఫ్రశ్నకు తనవద్ద సమాధానం లేదని పొన్నయ్యన్ అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని కూడా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జయలలిత ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ.41.63 కోట్ల చరాస్తులు, రూ.72.09 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొనడం తెలిసిందే.
280మంది జయ అభిమానుల మృతి
కాగా, ఈనెల 5న జయలలిత మృతి షాక్‌తో రాష్ట్రంలో మృతి చెందిన 280మంది అభిమానుల పేర్లను అన్నాడిఎంకె శనివారం విడుదల చేసింది. జయలలిత మృతి చెందిన రోజు షాక్‌తో 77మంది మృతి చెందగా, తర్వాత దుఃఖభారంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 203మంది మృతి చెందినట్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఒక జాబితా విడుదల చేసింది. మృతులు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు అన్నాడిఎంకె ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.