జాతీయ వార్తలు

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు శనివారం మూత్రపిండం (కిడ్నీ) మార్పిడి శస్తచ్రికిత్స జరిగింది. ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో జరిగిన ఈ ఆపరేషన్‌లో వైద్యులు జీవించివున్న బంధువు కాని వ్యక్తి కిడ్నీని తీసి సుష్మా స్వరాజ్‌కు అమర్చారు. కుటుంబ సభ్యుల్లో ఎవరి కిడ్నీ కూడా సుష్మా స్వరాజ్‌కు సరిపోకపోవడంతో జీవించి ఉన్న బంధువు కాని వ్యక్తినుంచి కిడ్నీని సేకరించినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసి మిశ్రా, సర్జన్లు వికె బన్సల్, వి శీను, నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్‌తో కూడిన వైద్యుల బృందం కార్డియో థొరాసిస్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్స చేశారు. అనంతరం సుష్మా స్వరాజ్‌ను అదే భవనంలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)కు తరలించారు. శస్తచ్రికిత్స ప్రారంభించడానికి ముందే కిడ్నీ మార్పిడికి ఆథరైజేషన్ కమిటీ నుంచి ఆమోదం పొందినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. కిడ్నీని దానం చేసే జీవించి ఉన్న బంధువు కాని వ్యక్తి కిడ్నీ స్వీకర్తకు మానసికంగా సన్నిహితులయిన స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు, అత్తమామల్లో ఎవరయినా కావొచ్చని ఆ వర్గాలు వివరించాయి. 64 ఏళ్ల సుష్మా స్వరాజ్ దీర్ఘకాలికంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. కిడ్నీ చెడిపోయినట్టు కనుగొన్న తరువాత ఆమెకు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తూ వచ్చినట్లు వివరించారు. కిడ్నీ చెడిపోవడంతో తాను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నానని సుష్మా స్వరాజ్ నవంబర్ 16న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

ఏటిఎం లూటీకి యత్నం
సెక్యూరిటీ గార్డు హత్య
పాట్నా నడిబొడ్డున దారుణం
పాట్నా, డిసెంబర్ 10: బిహార్‌లో ఏటిఎం లూఠీకి విఫలయత్నం చేసిన దుండగులు సెక్యురిటీ గార్డును హత్యచేశారు. రాజధాని పాట్నా నగర నడిబొడ్డునే ఉన్న డాగ్‌బంగ్లా సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ మను మహారాజ్ కథనం ప్రకారం వౌర్యలోక్ కాంప్లెక్స్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటిఎం ఉంది. కుందన్‌కుమార్(40) ఏటిఎంలో సెక్యురిటీ గార్డుగా ఉన్నాడు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటిఎంలో నగదు లూఠీ చేసేందుకు వచ్చారు. ఏటిఎంను పగలుగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గార్డు అడ్డుకోవడంతో ఆగ్రహించిన దుండగులు పదునైన ఆయుధంతో చంపేశారు. కుందన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. సంచలనం సృష్టించిన ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఏటిఎంపై దాడి, గార్డు హత్య నేపథ్యంలో కొత్వాలీ పోలీసు స్టేషన్ ఆఫీసర్ అవినాష్ కుమార్‌ను విధుల నుంచి తప్పించారు. అవినాష్ స్థానంలో రామ్‌శంకర్ సింగ్‌ను అక్కడ నియమించారు. శాంతి భద్రతల డిఎస్పీ శిబ్లినోమాని నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్‌పి ప్రకటించారు. ఫొరెన్సిట్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మరోపక్క దొంగల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గార్డు కుందన్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, పరిహారం అందించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.
ఐసిస్‌లో చేరి లిబియాలో
పట్టుబడిన థానే యువకుడు
ముంబయి, డిసెంబర్ 10: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరాడన్న ఆరోపణలపై మహారాష్టల్రోని థానేకి చెందిన 28 ఏళ్ల యువకుడిని దర్యాప్తు సంస్థలు లిబియాలో అరెస్టు చేశాయి. ఎటిఎస్ అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి పొరుగునే గల థానే జిల్లాలోని ముంబ్రాకు చెందిన తబ్రెజ్ మహమ్మద్ తాంబే అనే ఈ యువకుడు తన స్నేహితుడు అలీతో కలసి లిబియాలో ఐసిస్‌లో చేరాడని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఎటిఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్టులో ఉద్యోగం కోసం అని చెప్పి ఈ ఏడాది ఆరంభంలో భారత్ నుంచి బయలుదేరిన తబ్రెజ్ ఆ తర్వాత లిబియాలో దిగాడని, అక్కడ అతను ఐసిస్ తరఫున అమెరికా మిత్రపక్ష బలగాలతో పోరాడుతున్నాడని ఆ అధికారి వివరించారు. ఐసిస్‌లో చేరిన తబ్రెజ్ గత వారం వరకు తన కుటుంబ సభ్యులతో సెల్‌ఫోను ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడని, తబ్రెజ్‌కు వ్యతిరేకంగా అతని తమ్ముడు ఎటిఎస్‌ను సంప్రదించి ఫిర్యాదు దాఖలు చేయడంతో గత కొద్ది నెలలుగా అతని కదలికలపై నిఘా పెట్టిన దర్యాప్తు సంస్థలు చివరికి గత వారం లిబియాలో తబ్రెజ్‌ను అరెస్టు చేశాయని ఆ అధికారి తెలిపారు.