జాతీయ వార్తలు

మాకెందుకు అవకాశం ఇవ్వలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పెద్ద నోట్ల రద్దుపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో గొడవకు దిగారు. తనకు బదులు బిజెడి సభ్యుడు భర్తృహరి మహతాబ్ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినందుకు కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్ అధికారాన్ని ప్రశ్నించి వివాదం సృష్టించారు. ఖర్గేకు అవకాశం ఇవ్వనందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి చేసిన గొడవ మూలంగా లోక్‌సభ దద్దరిల్లిపోయింది.
ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ప్రధాని మోదీ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరుకావటంతో ప్రతిపక్షం మరింత రెచ్చిపోయింది. దీనికి ప్రతిగా బిజెపి సభ్యులు ఒక స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించారు. అధికార పక్ష సభ్యుడు జగదంబికా పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిఎస్‌పి నాయకులు నోట్ల మార్పిడికోసం కమీషన్ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దును విఫలం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ఆరోపించారు. దీనితో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయి వాదోపవాదాలు జరగటంతో స్పీకర్ సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే వాయిదా వేయవలసి వచ్చింది.
సభ పనె్నండు గంటలకు తిరిగి సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ మొదట అధికార పత్రాలు, నివేదికలను సభకు సమర్పింపజేశారు. తరువాత ఆమె జీరో అవర్ చేపట్టారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ఖర్గే లేచి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దశలో స్పీకర్ బిజెడి సభ్యుడు మహతాబ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన అగస్తా హెలికాప్టర్ల కుంభకోణం గురించి ప్రస్తావించారు. మహతాబ్‌కు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే ఆగ్రహోదగ్రుడయ్యాడు. తనకు అనుమతి ఇవ్వకుండా మహతాబ్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన బల్ల గుద్దుతూ స్పీకర్‌ను ప్రశ్నించారు. దీనితో సభలో గొడవ మిన్నంటింది. కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద ఉన్నారు కాబట్టి మీకు అనుమతి ఇవ్వలేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ దశలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వం, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. స్పీకర్ అధికారాన్ని ఖర్గే ప్రశ్నించటం చాలా విచారకరమని అనంతకుమార్ విమర్శించారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ సావధాన తీర్మానాలను సభకు సమర్పింపజేశారు. ఈ ప్రక్రియ ముగియగానే ఆమె సభను గురువారానికి వాయిదా వేశారు.

చిత్రం... లోక్‌సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే. సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ