అంతర్జాతీయం

సింధూ జలాల వివాదం .... అమెరికా మద్దతు కోరిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 31: భారత్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో అమెరికా మద్దతును పాక్ కోరింది. కాగా, ఈ సమస్యను భారత్, పాక్ రెండూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పిలుపునిచ్చారని శనివారం పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సింధూనదిపై భారత్ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తుండడంపై తలెత్తిన విభేదాలను పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంక్ ఆసక్తి చూపించకపోవడం పట్ల పాక్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గురువారం రాత్రి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పాక్ ఆర్థికమంత్రి ఇషాక్ దార్‌కు ఫోన్ చేసి సింధూ జలాల ఒప్పందం అమలుపై తలెత్తిన వివాదం, 1960లో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని కుదిర్చిన ప్రపంచ బ్యాంక్ పాత్రపైనా చర్చించినట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక పేర్కొంది. కెర్రీ ఫోన్ తర్వాత పాకిస్తాన్‌లో అమెరికా రాయబారి డేవిడ్ హేల్ కూడా ఇస్లామాబాద్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో దార్‌ను కలిశారు. ఈ ఇద్దరూ పాక్ ఆర్థిక మంత్రిని కలవడం ఈ జలాల వివాదం ఎంత కీలకమైనదో, ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయినట్లయితే ప్రాంతీయ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లుతుందో చాటి చెబుతోందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ‘ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని అమెరికా కోరుకుంటోంది’ అని కెర్రీ చెప్పినట్లుగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. సింధూ జలాల ఒప్పందంపై భారత్‌పై పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు తనకు తెలియజేసినట్లు కెర్రీ దార్‌కు చెప్పారు.
కాగా, ఈ నదీ జలాల వివాదం తిరిగి అమెరికాను పాక్ ఆర్థిక వ్యవహారాల తెరపైకి తీసుకు వచ్చినట్లయింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అమెరికా పౌర, మిలిటరీ సాయం గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ఇప్పటికే దాదాపుగా దివాలా తీసిన పాక్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించనుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే నెల ఒబామా ప్రభుత్వం అధికార పగ్గాలను డొనాల్డ్ ట్రంప్‌కు అప్పగించేందుకు సిద్ధమవుతున్న కారణంగా ఈ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడంలో అమెరికా చురుకైన పాత్ర పోషించే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కాగా, ఈ వివాదంలో పాకిస్తాన్ వాదన, న్యాయపరంగా దాని వైఖరికి అమెరికా మద్దతు తెలపడం ఎంతయినా అభినందించదగ్గ విషయమని దార్ అన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన తెలిపింది. అంతేకాదు సింధూనదీ జలాల ఒప్పందం అంతర్జాతీయ ఒడంబడిక అని, భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవించేలా, కోట్లాది మంది పాకిస్తానీల నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రపంచ బ్యాంక్‌పై ఉందని కెర్రీకి దార్ చెప్పినట్లు ఆ ప్రకటన తెలిపింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తుండడంపై మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ గత అక్టోబర్‌లో పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ వివాదం పరిష్కారంలో ప్రస్తుతానికి తాను మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేనని ఈ నెల ప్రారంభంలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.