జాతీయ వార్తలు

ఫిబ్రవరి 1న బడ్జెట్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ బడ్జెట్‌లో ప్రజలకు రాయితీలు ప్రకటించకూడదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనను ఫిబ్రవరి 1వ తేదీనుండి మరోతేదీకి మార్చాలంటూ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు పలు ఇతర ప్రతిపక్షాలు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీనాడు 2017-18 వార్షిక బడ్జెట్‌ను ఎలా ప్రతిపాదిస్తుందంటూ ప్రతిపక్షాలు రాసిన లేఖ తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ బుధవారం విలేఖరులకు చెప్పారు. ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో వార్షిక ప్రణాళికను ప్రతిపాదించటం మంచిది కాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రతిపాదించటం వలన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్‌పి తదితర పదహారు పార్టీల నాయకులు వాదిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్భిణీ మహిళలు, రైతులు, వృద్ధులకు ఇటీవల పలు రాయితీలు ప్రకటించటం తెలిసిందే. ఈ రాయితీలకు అదనంగా 2017-18 బడ్జెట్‌లో ప్రభుత్వం మరిన్ని రాయితీలు ప్రకటించటం వలన బిజెపికి లాభం కలిగి తమకు నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే బిజెపి ఈ వాదనను కొట్టివేస్తోంది. శాసనసభల ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా జరుగుతాయి, అధికారంలో ఉన్న పార్టీ ఏ మేరకు ప్రజలకు సేవ చేసింది, ప్రతిపక్షం ఏ మేరకు ప్రజల తరపున పోరాడిందనేది ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది తప్ప కేంద్రం తీసుకునే నిర్ణయాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి జి.వి.ఎల్. నరసింహారావు చెప్పారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రతిపాదించకూడదని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉన్నదని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశాభివృద్ధికి సంబంధించిన అంశమనేది మరిచిపోరాదని బిజెపి నాయకులు సూచిస్తున్నారు.