జాతీయ వార్తలు

ఉజ్వల భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వృద్ధికి మనమే ఊతం
ప్రజాస్వామ్యం, జనాభా,
డిమాండే మూల స్తంభాలు
ఆర్థిక సంస్కరణలకు మరింత ఊపు
రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు
ఎఫ్‌డిఐలు అపారం, జిడిపి పరుగులు
గుజరాత్ గ్లోబల్ సదస్సులో మోదీ

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం
చేపట్టిన చర్యలు సంతృప్తికరమైన ఫలితాల్ని ఇస్తున్నాయ.
స్థూలజాతీయోత్పత్తి పెరగడం, ద్రవ్యోల్బణం, విత్తలోటు, విదేశీ వాణిజ్య లోటు తగ్గడం, విదేశీ పెట్టుబడులు
పెరగడమే ఇందుకు సంకేతాలు.

గాంధీనగర్, జనవరి 10: జనాభా, ప్రజాస్వామ్యం, వినియోగ డిమాండే భారత దేశానికి ఎనలేని శక్తినిస్తున్న అంశాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉజ్వల గుజరాత్ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును మంగళవారం నాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యమే భారత దేశానికి తిరుగులేని బలమని పేర్కొన్న మోదీ ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో సక్రమంగా పాలన సాగదన్న వాదన ఉంది. కానీ ఈ రెండున్నరేళ్ల పాలనలో మంచి ఫలితాలు సాధించి ప్రజాస్వామ్య శక్తిని నిరూపించాం’అని ఉద్ఘాటించారు. ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని, రాజకీయ, ఆర్థిక రంగాల్లో గుణాత్మక మార్పులు తెస్తామని చెప్పారు. అవినీతి రహితమైన పాలనను అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకునేలా వ్యవస్థాగతమైన మార్పులు తెస్తామన్నారు. సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ధి అన్న అంశంపై 13వరకూ జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన నేతలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలు హాజరవుతున్నారు. ‘డావోస్ ఆఫ్‌ది ఈస్ట్’గా పేర్కొనే ఉజ్వల గుజరాత్ ద్వైవార్షిక సదస్సు 2003లో మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. వ్యాపారానుకూల వాతావరణాన్ని పెంపొందించడం, పెట్టుబడుల్ని విస్తృత ప్రాతిపదికన ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యాలని మోదీ తెలిపారు. సులభంగా వ్యాపారం చేసుకోగలిగే వాతావరణాన్ని కల్పించేందుకు తాము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఆర్థిక సంస్కరణల్ని వేగవంతం చేయడం ద్వారా వ్యాపారానుకూల పరిస్థితుల్ని బలోపేతం చేస్తామని చెప్పారు. భారత దేశ శక్తి సంపదల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా నిరంతరం శ్రమిస్తూనే వచ్చిందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాము చేపట్టిన చర్యలు సంతృప్తికరమైన ఫలితాల్ని ఇస్తున్నాయని, స్థూలజాతీయోత్పత్తి పెరగడం, ద్రవ్యోల్బణం, విత్తలోటు, విదేశీ వాణిజ్య లోటు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడమే ఇందుకు సంకేతాలని మోదీ ఉదహరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పుంజుకుంటోందని ఉద్ఘాటించిన ప్రధాని అంతర్జాతీయ మాంద్య పరిస్థితుల్లోనూ భారత వృద్ధి తగ్గలేదని గుర్తు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ వృద్ధికి భారత్ ఇంజన్ వంటిదన్నారు. సుపరిపాలనలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని, అన్ని రకాల నిబంధనలు, విధానాలను హేతుబద్ధంగా తీర్చిదిద్దామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను సరళతరం చేశామని, ఇందుకు వీలుగా అన్ని రంగాల్లోనూ మార్పులు తెచ్చామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ 130 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, భారత ఆర్థిక వ్యవస్థ పట్ల విదేశీ ఇనె్వస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని మోదీ అభివర్ణించారు.

చిత్రం...
ఉజ్వల గుజరాత్ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో క్యాలెండర్ విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ