జాతీయ వార్తలు

కాశ్మీర్ అల్లర్ల మూల్యం 16వేల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జనవరి 10: కాశ్మీర్ లోయలో గత ఏడాది దాదాపు అయిదు నెలలపాటు సుదీర్ఘంగా సాగిన అల్లర్ల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతోపాటుగా కోట్లాది రూపాయల ఆస్తుల నష్టంతో కలిసి రాష్ట్రానికి దాదాపు రూ.16,000 కోట్ల మేర నష్టం సంభవించింది. ‘2016 జూలై 8నుంచి నవంబర్ 30 దాకా కొనసాగిన అల్లర్ల కారణంగా నష్టం రూ.16,000 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది’ అని మంగళవారం జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు సమర్పించిన ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆందోళన కారణంగా రాష్ట్ర ప్రజలకు అంతులేని కష్టాలతో పాటుగా పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించిందని, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, అంతేకాక వందల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమైనాయని ఆ నివేదికలోని ‘ఎకానమీస్ ఆఫ్ అన్‌సర్టినిటీ అండ్ కాంఫ్లిక్ట్స్’ అనే అధ్యయనంలో తెలియజేశారు. అల్లర్ల సమయంలో సుదీర్ఘకాలం ఇంటర్నెట్ సేవలు, మొబైల్, టెలిఫోన్ సర్వీసులను రద్దు చేయడంతో రాష్ట్రంలో కమ్యూనికేషన్ కష్టమై పోయిందని, బంద్‌లు, హర్తాళ్లు, రాళ్లు రువ్వడం, కర్ఫ్యూలు, ఆంక్షల కారణంగా కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. వైద్య సేవలు బాగా దెబ్బతిన్నాయని, క్యాన్సర్, గుండెజబ్బులు లాంటి వ్యాధులతో బాధపడేవారు, డయాలసిస్ అవసరమైనవారు, చికిత్సలు, చెకప్‌లు కొనసాగిస్తున్నవారు చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని, ప్రధానమైన చికిత్స కరువై కొంతమంది పేషెంట్లు చనిపోవడం కూడా జరిగిందని ఆ నివేదిక తెలిపింది. 2016లో జరిగిన అల్లర్ల కారణంగా జరిగిన నష్టానికి అదనంగా భద్రతాపరమైన ఖర్చు కూడా భారీగా జరిగిందని కూడా తెలిపింది.
తలసరి జిడిపి వృద్ధి, ఎఫ్‌డిఐల రాకడ, ఎగుమతులు, వ్యాపారాలు అన్నీ తగ్గిపోయాయని, పర్యాటకుల సంఖ్య సైతం తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. 2015-16 సంవత్సరంలో కాశ్మీర్ లోయను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 6,23,932 ఉండగా, వీరిలో అమరనాథ్ యాత్రికుల సంఖ్య 2,20,490 ఉందని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో టూరిజం సీజన్ ప్రారంభం కాగా, జూలై 7 వరకు జోరుగా సాగిందని, ఆ తర్వాత అల్లర్లు ఉద్రిక్తత కారణంగా దాదాపు నాలుగు నెలల పాటుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో కాశ్మీర్‌లోకి పర్యాటకులు ఎవరూ రాలేదని, ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హౌస్ బోట్లు, రవాణాదారులు.. ఇలా ఈ రంగానికి అనుబంధంగా ఉండే అన్ని వ్యాపారాలు కూడా బాగా నష్టపోయాయని ఆ నివేదిక తెలిపింది.

13న ఇసి ముందు
‘సైకిల్’ పంచాయతీ
ములాయం, అఖిలేశ్ వర్గాలకు నోటీసులు
న్యూఢిల్లీ, జనవరి 10: యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ఏ వర్గానికి కేటాయించాలన్న దానిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వర్గాలు సైకిల్ తమకే కేటాయించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జనవరి 17నాటికే గుర్తు వివాదం పరిష్కరించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 13న ములాయం, అఖిలేశ్ వర్గాల వాదనను వినాలని ఇసి నిర్ణయించింది. యూపీ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 11న జరుగనుంది. ఈ నెల 13న తమ ముందు వాదనలు వినిపించాలని సమాజ్‌వాదీ పార్టీ రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సంతకాలతో ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గం ఓ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘానికి అందజేసింది. మరోపక్క పార్టీ నిబంధనల ప్రకారం తానే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతానంటూ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించుకున్నారు. అలాగే అఖిలేశ్ దాఖలు చేసిన అఫిడవిట్ ఫోర్జరీ అని దానిపై విచారణ జరపాలని ములాయం వర్గం డిమాండ్ చేస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న దృష్ట్యా సాధమైనంత త్వరగా సైకిల్ గుర్తు వివాదం పరిష్కరించాలని అఖిలేశ్ వర్గం సోమవారం ఎన్నికల సంఘాన్ని కోరింది.