జాతీయ వార్తలు

సామర్థ్యాన్ని పెంచుకునేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ప్రయోగం సందర్భంగా మరిన్ని ఎక్కువ ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించేలా తన గరిష్ఠ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తోందని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. రికార్డు కోసమో, మరోదాని కోసమో తాము ఈ పని చేయడం లేదన్నారు. ఇస్రో ఒకేసారి ఒకే రాకెట్‌తో 103 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇంకా నెల రోజులలోపే సమయం ఉన్న నేపథ్యంలో బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్రో 103 ఉపగ్రహాలను తన అంతరిక్ష వాహక నౌక పిఎస్‌ఎల్‌వి-సి37 ద్వారా ప్రయోగిస్తుందని భావిస్తున్నారు. అయితే వీటిలో వంద ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి ఉన్నాయి. కర్ణాటక ఐసిటి సమ్మిట్ 2017లో పాల్గొన్న కిరణ్‌కుమార్ విడిగా విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో ప్రయోగించనున్న ఈ ఉపగ్రహాలన్నీ గ్రహమండలంగా పనిచేస్తూ భూమిని పరిశీలిస్తుంటాయని చెప్పారు. స్వదేశానికి చెందిన మూడు ఉపగ్రహాలలో 730 కిలోగ్రాముల బరువు గల కార్టోశాట్-2 సిరీస్‌కు చెందిన ఉపగ్రహం, 30 కిలో గ్రాముల బరువు గల ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి ఉన్నాయి. ఇస్రో ఈ 103 ఉపగ్రహాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రయోగించనుంది. ఇస్రో తన ప్రతి ప్రయోగాన్ని రాకెట్ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచుకోవడానికి ఉపయోగించుకోవడంతోపాటు మరింత తరచుగా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు కృషి చేస్తోందని కిరణ్ కుమార్ చెప్పారు. దాదాపు నెలకొక్క ప్రయోగం చేసేట్లుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సామర్థ్యాన్ని పెంచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కృషి చేస్తున్నామని చెప్పారు. మనకెన్నో ఉపగ్రహాలు ఉన్నప్పటికీ అవసరమైన సేవలను అందించడానికి మరిన్ని ఉపగ్రహాల అవసరం ఉందని అన్నారు. అంగారక యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు రెండో మార్స్ మిషన్‌కోసం ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంగారకుడిపైకి మరో మిషన్‌ను పంపించడంతోపాటు శుక్ర, బృహస్పతి గ్రహాల కక్ష్యలలోకి ఉపగ్రహాలను పంపించేందుకు కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అధ్యయనాలు ముగిశాక ఒక ప్రణాళిక రూపొందించి ఆమోదం పొందవలసి ఉంటుందని చెప్పారు.

సుప్రీం ఆదేశాలే
శిరోధార్యం
జల్లికట్టుపై కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జనవరి 11: జల్లికట్టు క్రీడ నిర్వహించుకునేందుకు ఆర్డినెన్స్ ఇవ్వాలన్న తమిళనాడు విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. జల్లికట్టుపై సానుకూలత వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలకోసం వేచిచూస్తున్నట్టు ప్రకటించింది. ‘మా నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే సుప్రీం కోర్టు ఆదేశానుసారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్పుకోసమే చూస్తున్నాం’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే స్పష్టం చేశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై నేతృత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం మంత్రితో భేటీ అయింది. గత యుపిఏ ప్రభుత్వం జల్లికట్టు ఎద్దులను వన్యప్రాణుల చట్టంలో చేర్చిందని ఆరోపించారు. జల్లికట్టు ఓ క్రీడ అని దానిలో పాల్గొనే కోడె దూడల పట్ల కఠినంగా వ్యవహరించరని, అదొక వినోదం మాత్రమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు దీనిపై సానుకూలమైన ఆదేశం ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ జల్లికట్టును నిర్వహించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘తమిళనాడు ప్రజల మనోభావాలను మేం అర్థం చేసుకోగలం. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలి. కేంద్రం తన అభిప్రాయం కోర్టుకు చెబుతుంది’ అని మంత్రి వివరించారు.