జాతీయ వార్తలు

ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుకు తెరపడింది. కాంగ్రెస్ అధిక సీట్లు డిమాండ్ చేసినందుకే పొత్తు కుదరటం లేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించగా, ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించటంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధినాయకత్వం 120 సీట్లు డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ అగర్వాల్ చెప్పారు. కాంగ్రెస్ తన మొండిపట్టు ద్వారా బిజెపికి సాయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని మరోవైపు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగేందుకు ప్రియాంక గాంధీ కూడా ఆఖరు క్షణం వరకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె శనివారం సాయంత్రం వరకు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు పదకొండు ఎస్‌ఎంఎస్‌లు చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ హుటాహుటిన లక్నో వెళ్లారు. 120 సీట్లతోపాటు రాష్ట్రంలో మైనారిటీ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలోని నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనితోపాటు అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలలోని అన్ని అసెంబ్లీ సీట్లను తమకు కేటాయించాలంటోంది. దీనికి అఖిలేశ్ అంగీకరించటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన స్థానాలతోపాటు మరో డెబ్బై నియోజకవర్గాల్లో ఎస్‌పి అభ్యర్థులు పోటీ చేస్తారని, మిగతా వంద సీట్లను కాంగ్రెస్‌కు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించిందని అగర్వాల్ వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేదని, అయినా తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు అనటం విచిత్రంగా ఉన్నదని ఎస్పీ నాయకులు అంటున్నారు.
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరే సీట్ల సర్దుబాటు గురించి పత్రికలకు వివరించేందుకు లక్నో రావాలన్న సమాజ్‌వాదీ పార్టీ విజ్ఞప్తిని రాహుల్ గాంధీ తిరస్కరించినట్లు తెలిసింది. పొత్తు కుదరకపోవటానికి ఇది కూడా ఒక కారణమని ఎస్పీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీపై ఆధారపడి ఉన్నది తప్ప తమ పార్టీ కాంగ్రెస్‌పై ఆధారపడి లేదని అగర్వాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు మాత్రమే ఇస్తామని, ఇంతకు మించి ఒక్క సీటు కూడా ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం తమ నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై సమాజ్‌వాదీ పార్టీతో జరుపుతున్న సీట్ల సర్దుబాటు చర్చల గురించి సమీక్షించారు. ఆ పార్టీతో పొత్తుకుదరని పక్షంలో ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది కూడా వారు చర్చించారు.

బిఎస్‌ఎఫ్ జవాన్‌ను
అప్పగించిన పాక్
అట్టారీ, జనవరి 21: గత ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)ను పొరపాటున దాటి పాక్‌లో ప్రవేశించిన సైనికుడిని భారత్‌కు అప్పగించారు. అట్టారీ-వాఘ చెక్‌పోస్టు వద్ద చందు బాబూలాల్ చవాన్ అనే బిఎస్‌ఎఫ్ జవాన్‌ను పాక్ అప్పగించింది. 22 ఏళ్ల బాబూలాల్ లక్ష్యిత దాడి సందర్భంగా ఎల్‌ఓసి దాటేశాడు. 37 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన అతడిని మానవతా దృక్పధంతో మాతృదేశానికి అప్పగించామని పాక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జమ్మూకాశ్మీర్‌లోని మెంధారీ జిల్లాలో ఎల్‌ఓసి వద్ద బాబూలాల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్జికల్ స్ట్రయిక్ సందర్భంగా బాబూలాల్ పొరపాటున నియంత్రణ రేఖ దాటి పాక్ భూ భాగంలో ప్రవేశించాడని అతడి సోదరుడు, సైన్యంలోనే సిపాయిగా పనిచేస్తున్న భూషణ్ చవాన్ తెలిపాడు. తన సోదరుడిని స్వదేశానికి రప్పించడానికి సైనిక అధికారులు జరిపిన కృషికి ఎన్నటికీ మరువలేమని అతడు పేర్కొన్నాడు. ‘డిజిఎంఓ, ఆర్మీకి కృతజ్ఞతలు. వారి కృషికి ధన్యవాదాలు. మా సోదరుడికోసం ప్రార్థనలు చేసిన గ్రామస్థులు ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కారం చెబుతున్నా’నని అన్నాడు. బాబూలాల్ మహారాష్టల్రోని ధులే జిల్లా బోర్విహిర్ గ్రామానికి చెందినవాడు. అతడు పాకిస్తాన్ సైనికుల చెరలో ఉన్నాడన్న వార్త తెలియగానే షాక్ గురై అమ్మమ్మ మృతిచెందింది.

అంత భద్రత
నాకెందుకు?
ప్రజలకోసం వినియోగించండి
పంజాబ్ ఇసికి కేజ్రీవాల్ లేఖ
చండీగఢ్, జనవరి 21: పంజాబ్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో తనకు కల్పిస్తున్న పోలీసు భద్రతను ఉపసంహరించాలని కోరారు. ఈ మేరకు ఆయన పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికె.సింగ్‌కు లేఖ రాశారు. ‘పంజాబ్‌లో పర్యటిస్తున్నప్పుడు నా భద్రతకోసం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు. ఇంత భారీ భద్రత అవసరం లేదని అభిప్రాయపడుతున్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నందున తన భద్రతలో పోలీసు సిబ్బందిని ఉపసంహరించి రాష్ట్ర ప్రజల భద్రతకోసం ఉపయోగించాలని, ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ లేఖ అందిందని, ఆయన భద్రతపై సమీక్ష జరిపి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ ఈ లేఖను పంజాబ్ డిజిపికి పంపామని వికె.సింగ్ తెలిపారు.