జాతీయ వార్తలు

విధ్వంసమే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు అమెరికాలో జరిపిన 9/11 తరహా దాడులకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రపంచ వాణిజ్య భవన సముదాయంపై విమానాలతో దాడి చేసి పెను విలయానికి కారణమైనట్టుగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలోనూ దేశ రాజధానిలో అదే మాదిరి దాడులకు పాల్పడవచ్చని సమాచారం అందించింది. జంతువులను సైతం ఆత్మాహుతి దాడులకు ఉపయోగించుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలతో భద్రతా దళాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రమత్తతకూ తావులేకుండా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వాయుమార్గ దాడులను సైతం అడ్డుకునేందుకు పారామిలటరీ బలగాలు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశముందని కూడా ఇంటెలిజన్స్ ఏజన్సీల హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘టెర్రరిస్టు గ్రూపులు అత్యాధునిక టెక్నాలజీతో, సరికొత్త టెక్నిక్‌లతో దాడులకు పాల్పడే అవకాశం ఉంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవటానికి భద్రతాదళాలు సంసిద్ధంగా ఉండటం అత్యవసరం’ అని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు సైనిక, పోలీసు దుస్తుల్లో గణతంత్ర పరేడ్‌లోకి చొరబడే అవకాశం ఉన్నందున రిపబ్లిక్‌డే విధుల్లోకి వచ్చే ప్రతి పోలీసునూ క్షుణ్ణంగా పరిశీలించాల్సిందేనని రక్షణ శాఖకు నిఘా సంస్థలు సూచించాయి. ముఖ్యంగా రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే రిపబ్లిక్ డే పరేడ్ జరిగే రాజ్‌పథ్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా లష్కరే తోయిబా లాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు 9/11 తరహా దాడులు జరపడానికి చార్టెడ్ విమానాలు, డ్రోన్‌లను ఉపయోగించే అవకాశాలున్నాయంటూ ఇంటెలిజన్స్ ఏజన్సీల తాజా హెచ్చరికల దృష్ట్యా అలాంటి దాడులను తిప్పికొట్టే టెక్నాలజీతో భద్రతా దళాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఎత్తయిన భవనాలపై యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌తో షార్ప్ షూటర్లను మోహరించడంతో పాటుగా అదనంగా సిసిటీవీ టీవీలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు కెమెరాలనుంచి అందే సమాచారాన్ని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతాల్లో 50 వేల మంది ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించి, అనుమానంగా కనిపించిన వారినందరినీ తనిఖీ చేస్తున్నారు. గల్లీలను సైతం వదిలిపెట్టకుండా అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోను అదనపు బలగాలను నియమించారు. పరేడ్ జరిగే సమయంలో అంటే ఉదయం 10.35నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను సైతం నిషేధించారు.

చిత్రం... గణతంత్ర దినోత్సవ మార్చి ఫాస్ట్ కోసం ముస్తాబైన రాజ్‌పత్ రోడ్.