జాతీయ వార్తలు

దశ,దిశలేని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ వర్గానికీ ఒరిగింది లేదు
అంకెల గారడీ, పదాడంబరం
నల్లధనంపై మాటే లేదు
అంతా అసెంబ్లీ ఎన్నికల దృష్టే
బుల్లెట్ ట్రైన్ ఎక్కడుంది?
జైట్లీ బడ్జెట్‌పై విపక్షాల విసుర్లు, విమర్శలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అరుణ్‌జైట్లీ సమర్పించిన 2017-18 వార్షిక బడ్జెట్ ఎలాంటి దృక్పథం గాని దిశగాని లేదని విపక్షాలు విరుచుకుపడ్డాయి. రైతులు, యువతకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదని, ఉపాధి కల్పనకు ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ విరుచుకుపడింది. అసలు ఆర్థిక మంత్రి అభివృద్ధి ఆలోచన ఏమిటో ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారో బడ్జెట్‌లో ఏ మాత్రం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే దేశ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా తీసుకున్న చర్య ప్రశంసనీయమన్నారు. రైల్వే బడ్జెట్‌కు సంబంధించి కూడా ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని అన్నారు.‘బులెట్ ట్రైన్లు తెస్తామన్నారు. అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. అలాగే రైల్వేల్లో అత్యంత ప్రాధమికమైన భద్రతకు సంబంధించి కూడా కచ్చితమైన ప్రతిపాదనలు లేవు’అన్నారు. అయితే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాత్రం ఏ విధంగా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అమలు చేయబోతుందన్నది స్పష్టం చేయలేదని విమర్శించారు. కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం బడ్జెట్ దృష్టి సాగిందని, రైతులు, యువత, మహిళలు సహా ఎవరికీ ఉపకారం జరగలేదని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అయితే దీన్నొక నిరర్ధక బడ్జెట్‌గా, దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించిన హృదయంలేని బడ్జెట్‌గా అభివర్ణించారు. నోట్ల రద్దుకు సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని అన్నారు. దేశ భవితకు సంబంధించి ఎలాంటి దిశ, నిర్దేశనా జరగలేదని, కేంద్రంలోని ఎన్‌డిఏ సర్కార్ విశ్వసనీయతనే కోల్పోయిందని మమత అన్నారు. ఇప్పటికీ కూడా నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలైతే ఈ బడ్జెట్‌ను ఓ జిమ్మిక్ గానే అభివర్ణించాయి.అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి బదులు కుంచించుకుపోయే విధంగానే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నాయి. వాస్తవ పరిస్థితులకు ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలకు ఏ కోశాన పొంతన లేదని విరుచుకుపడ్డాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయని, అంకెల గారడీ, పదాల ప్రయోగంతోనే జైట్లీ పెద్దపద్దు సాగిందని విపక్షాలు ముకుమ్మడిగా ధ్వజమెత్తాయి. రాజకీయ పార్టీల విరాళాలపై ప్రభుత్వ ప్రతిపాదనలను దుయ్యబట్టాయి. ప్రభుత్వం ఏదో చేస్తుందని భావిస్తే వ్యవహారం చప్పగా సాగిందంటూ ఎద్దేవా చేశాయి. ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తరహాలో గణాంకాలు, పదాల గారడీతోనే జైట్లీ కాలక్షేపం చేసినట్టు కనిపిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి దుయ్యబట్టారు.
పెద్దనోట్ల రద్దువల్ల ఏ మేరకు నల్లధనం వెలికితీయగలిగామో ప్రభుత్వం వెల్లడించలేకపోయిందని జెడియు నేత శరద్ యాదవ్ అన్నారు. ఓ పక్క ఉత్పాదక వృద్ధి రేటు తగ్గిపోతుంటే ప్రభుత్వానికి రెవిన్యూ ఎక్కుడ నుంచి వస్తుందో వెల్లడించలేదని బిజెడి నేత భర్తృహరి మహతాబ్ విమర్శించారు. మధ్యతరగతి ఆదాయ వర్గాలకు మరింత ఆర్థిక వెసులుబాటును కలిగించి ఉండాల్సిందని పేర్కొన్నారు.నోట్ల రద్దు అవస్థలకు సంబంధించి సరళమైన పదజాలంతో,కవితాత్మకతో దాటవేసే ప్రయత్నం చేశారని జైట్లీని విమర్శించారు.