జాతీయ వార్తలు

మీరు సచ్చీలురు.. మేము కళంకితులమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 8: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల వారిని కళంకితులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అంతేకాదు దమ్ముంటే తృణమూల్ కాంగ్రెస్ నేతలందరినీ అరెస్ట్టు చేయాలని బిజెపికి సవాలు విసిరిన ఆమె తమ పార్టీ దానికి ఎంతమాత్రం భయపడ్డం లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించలేదని, అందువల్ల ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ‘మీరు మాత్రమే పరిశుద్ధులు, మిగతావాళ్లంతా కళంకితులా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలు ఇంతకు ముందెన్నడూ చూడలేదు’ అని బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ మమత అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిఎంసి నేతల్లో చాలామంది జైళ్లలో ఉంటారంటూ బిజెపి నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం చెప్తూ, దమ్ముంటే తమ పార్టీ నేతలను అరెస్టు చేయాలని బిజెపిని సవాలు చేశారు. ‘రాబోయే రోజుల్లో మా పార్టీ నేతలంతా అరెస్టవుతారంటూ ఇటీవల వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చదివాను. మేమేమీ భయపడం. ఏడ్చే చిన్నారిని నోరు మూసుకో.. లేదంటే గబ్బర్ సింగ్ వస్తాడంటూ బెదిరించినట్లుగా పరిస్థితి ఉంది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇతర పార్టీలకు చెందిన నాయకులపైన కూడా తమ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని ఆమె అంటూ, అయితే తాము రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడకపోవడం టిఎంసి మర్యాద అని ఆమె అన్నారు. ‘మా ఎంపీలను న్యూఢిల్లీలో చెట్లకు కట్టేస్తామని మీరు అంటున్నారు. అయితే మీరు జీవితమంతా పదవిలో కొనసాగరనే విషయం గుర్తుంచుకోండి. మీ పదవీ కాలం అయిపోయాక వేరేవాళ్లు అధికారంలోకి రావచ్చు. ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం మా పార్టీ మర్యాద’ అని మమత అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని జనం హృదయపూర్వకంగా అంగీకరించలేదని, భయంతో మాత్రమే అంగీకరించారని ఆమె అన్నారు. అందుకే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుందన్నారు. నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 25 శాతం పడిపోయిందని, దీనివల్ల నల్లధనాన్ని దాచుకున్నవారు మాత్రమే ప్రయోజనం పొందారని, నిజాయితీపరులు, కష్టపడి సంపాదించుకున్న వారు ఇబ్బందుల పాలవుతున్నారని సిఎం చెప్పారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని మమత తప్పుబడుతూ, తమ పార్టీ ఎన్నికల సంస్కరణలకు, ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వం భరించడానికి అనుకూలమని చెప్పారు. ఎన్నికల సంస్కరణలను డిమాండ్ చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒక తీర్మానం చేయాలని ఆమె సూచించారు.