జాతీయ వార్తలు

సారథులు మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, మార్చి 8: మహిళలే అభివృద్ధి సారధులు కావాలనీ, వారి నేతృత్వంలోనే భారతావని మరింత ముందుకు దూసుకుపోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో బుధవారం మహిళా సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని దేశ పురోగతిలో మహిళలు నిర్వహిస్తున్న పాత్రలను గ్రామీణ భారత అభ్యున్నతికి మహిళా సర్పంచులు పనిచేస్తున్న తీరును శ్లాఘించారు. లింగవివక్షను మట్టుబెట్టాలని ఉద్ఘాటించిన ఆయన భ్రూణహత్యలను పటిష్టమైన చర్యలతో నిరోధించాలన్నారు. ఈ విషయంలో మహిళా సర్పంచులు నిర్వహిస్తున్న పాత్ర నిరుపమానమని స్పష్టం చేశారు. గ్రామీణ భారతంలో గుణాత్మకమైన మార్పులకు సారథులు మహిళలేనని స్పష్టం చేశారు. తమ ప్రతిభా సంపత్తుల విషయంలో తలెత్తిన అపోహలను మహిళలు బద్దలు కొట్టారని తమ నిజమైన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పారని స్పష్టం చేశారు. భారత గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న నిర్మాణాత్మకమైన, గుణాత్మకమైన మార్పులకు మహిళలే ఆద్యులని, వారి నిరంతర కృషి, పట్టుదల వల్లే గ్రామీణ ప్రాంతాలు ప్రగతి పథంలో విలసిల్లుతున్నాయని అన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ్భారత్ సాధనలో మహిళలు నిర్వర్తించిన పాత్ర నిరుపమానమని పేర్కొన్న మోదీ స్వచ్ఛ శక్తి అవార్డులను ఈ సందర్భంగా అందించారు. రాజకీయ స్వేచ్ఛ కంటే స్వచ్ఛతకు, పరిశుభ్రతకు మహాత్మాగాంధీ కృషి చేశారంటూ ఈ సందర్భంగా ఆయన మాటలను ఉటంకించారు. మహాత్ముడు తన జీవితాంతం స్వచ్ఛత, పరిశుభ్రతకే దీక్షతో కృషి చేశారని పేర్కొన్న మోదీ గ్రామీణ ప్రాంతంలోనే నిజమైన భారతదేశం ఉందన్న ఆయన మాటలు అక్షర సత్యాలేనన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలు నగరాలతో పోటీగా అభివృద్ధి చెందుతున్నాయంటే వాటి వెనుక మహిళా సర్పంచుల కృషి ఎంతో వుందని స్పష్టం చేసిన మోదీ వారి బాటలోనే భారతావని మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో వుందన్నారు. అన్ని రంగాల్లోనూ అతివలు దూసుకుపోతున్న తరుణంలో భ్రూణహత్యలు శాపంగా మారాయని, లింగవివక్షకు ప్రతి రూపంగా సాగుతున్న వీటిని నిరోధించడంలో మహిళలే మార్గదర్శకులు కావాలని స్పష్టం చేశారు. ఇంకెంతమాత్రం భ్రూణహత్యలను అనుమతించేది లేదని, ముఖ్యంగా మహిళలే సర్పంచులుగా ఉన్న గ్రామాలు ఇందుకు మార్గనిర్దేశన చేయాలని మోదీ ఉద్ఘాటించారు. గతంలో హర్యానా సహా అనేకచోట్ల జరిగిన సమావేశాల్లోకూడా భ్రూణహత్యలకు సంబంధించి మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

చిత్రం... గాంధీనగర్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సర్పంచ్‌లకు స్వచ్ఛ శక్తి పురస్కారాన్ని అందిస్తున్న ప్రధాని మోదీ