జాతీయ వార్తలు

షరీఫ్‌తో చర్చలు ఇక అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: పాకిస్తాన్ సైన్యాన్ని, ఇస్లామిక్ ఉగ్రవాదులను అదుపు చేయలేని ప్రధాని నవాజ్ షరీఫ్‌తో శాంతి చర్చలు జరపకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వత్తిడి పెరుగుతోంది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్ వెళ్లి అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను కలిసి శాంతి చర్చలు జరిపి వచ్చిన వెంటనే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ దురాగతానికి పాల్పడినట్లే, ఇప్పుడు నరేంద్ర మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటనకు వెళ్లి ప్రధాని నవాజ్ షరీప్‌తో శాంతి చర్చలు జరిపి వచ్చిన ఏడు రోజులకే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహెల్ షరీఫ్ పఠాన్‌కోట్ ఏయిర్ బేస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడి చేయించారు. కార్గిల్ దురాగతానికి పాల్పడటంతో జనరల్ పర్వేజ్ షరీఫ్ కొంత విజయం సాధిస్తే ఇప్పుడు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేయించటంలో రాహెల్ షరీఫ్ విజయం సాధించలేకపోయారు. కార్గిల్ మాదిరిగా పఠాన్‌కోట్ కుట్ర విజయవంతమైతే నరేంద్ర మోదీ పరువు, ప్రతిష్ట మంటకలిసేవని బిజెపి నాయకులు భావిస్తున్నారు. భద్రతా దళాలు ముందుగానే మేల్కొని ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుబెట్టకుంటే పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పేలిపోయేది. ఇదే జరిగివుంటే నరేంద్ర మోదీతోపాటు బిజెపి ప్రతిష్ఠ దెబ్బతినేదని పార్టీ నాయకులు అంటున్నారు. కార్గిల్ దురాగతం అనంతరం భారత, పాకిస్తాన్ దేశాలు యుద్ధం అంచుల వరకు వెళ్లి రావటం తెలిసిందే. అమెరికా జోక్యంతో కార్గిల్ కొండలపై తిష్టవేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు తోక ముడిచారు. అదే జరగకపోతే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేది. ఇప్పుడు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడిచేసి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసమై ఉంటే మరోసారి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేదని భావిస్తున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ సైన్యం ఉన్నందున ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను కొనసాగించకూడదని పలువురు పార్టీ నాయకులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీల వారు కూడా ఒకటి, రెండు రోజుల తరువాత పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ దాడికి నరేంద్ర మోదీని తప్పుపట్టటం ప్రారంభిస్తారని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనేది పఠాన్‌కోట్ సంఘటన మరోసారి రుజువుచేసిందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదని వారంటున్నారు. నవాజ్ షరీఫ్ డమీ ప్రధాన మంత్రి, అతనితో చర్చలు జరపట వృధా అని వారు వాదిస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ వరకు చొచ్చుకు రావటానికి పాక్ సైన్యం, ఐఎస్‌ఐ హస్తాన్ని స్పష్టం చేస్తోందని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో ముఖ్యంగా నవాజ్ షరీఫ్‌తో శాంతి చర్చలు జరపటంలో అర్థం లేదన్నది వారి వాదన.
పాకిస్తాన్‌ను ఏ విధంగానూ విశ్వసించలేం, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినంత కాలం పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదు, అమెరికాకు ఈ విషయం స్పష్టంగా చెప్పాలని పలువురు బిజెపి నాయకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజంతా మైసూర్‌లో జరుగుతున్న 103 జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఉన్నా, ఎప్పటికప్పుడు పఠాన్‌కోట్ పరిణామాలను తెలుసుకోవటంతోపాటు పలు అంశాలపై తగు సూచనలు ఇచ్చారు. ఆయన ఢిల్లీకి చేరుకున్న వెంటనే సీనియర్ భద్రత, సైనిక, ఇంటలిజెన్స్ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ఖండించినా దాడికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవటం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయకపోవటం గమనార్హం.