జాతీయ వార్తలు

శాంతి చర్చలు ఇష్టం లేకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు లాహోర్‌లో కలిసి చర్చలు జరిపినందుకు ఆగ్రహించిన పాకిస్తాన్ సైన్యం జైషే మహమ్మద్ ద్వారా పఠాన్‌కోట్ దాడి జరిపించినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో శాంతి చర్చలు ప్రారంభించటం ఇష్టం లేని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ జైషే మహమ్మద్‌ను ఉపయోగించుకున్నారని అంటున్నారు. సైన్యం పరిధిలో పనిచేసే పాకిస్తాన్ గూడచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) రూపొందించిన పథకం ప్రకారమే జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు పంజాబ్‌లోకి వచ్చి పఠాన్‌కోట్‌లోని అత్యంత ముఖ్యమైన ఎయిర్ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ నుంచి ఢిల్లీకి వస్తూ మార్గమధ్యలో లాహోర్‌లో ఆకస్మిక పర్యటన చేసి నవాజ్ షరీఫ్ గ్రామానికి వెళ్లటం, విమానాశ్రయంలో పాక్ ప్రధానితో చర్చించటం పాకిస్తాన్ సైన్యానికి ఎంతమాత్రం మింగుడు పడలేదని అంటున్నారు.
నరేంద్ర మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటన గురించి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రావెల్ షరీఫ్‌కు ముందే తెలియజేయటంతోపాటు ఆయన సమ్మతి మేరకే నరేంద్ర మోదీతో నవాజ్ షరీఫ్ చర్చలు జరిపారని వార్తలు రావటం తెలిసిందే. అయితే వాస్తవానికి నరేంద్ర మోదీ లాహోర్‌కు రావటం పాకిస్తాన్ సైన్యం ముఖ్యంగా ఐఎస్‌ఐకి ఎంతమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. నరేంద్ర మోదీ ఆకస్మికంగా లాహోర్ వచ్చి చర్చలు జరపటం వలన పాకిస్తాన్ కంటే భారతదేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగిందని పాక్ సైన్యం భావిస్తున్నట్లు తెలిసింది. భారత్‌కు ఎక్కువ ప్రయోజనం కలగటంతోపాటు నవాజ్ షరీఫ్ ప్రాధాన్యత కూడా పెరిగిందని పాక్ సైన్యం అంచనా వేసిందని అంటున్నారు. నవాజ్ షరీఫ్ ఎదగటం సైన్యానికి ఇష్టం లేదు. అందుకే పాకిస్తాన్ పరిపాలనలో నవాజ్ షరీఫ్ స్థానం ఏమిటనేది చూపించేందుకే పాక్ సైన్యం జైషే మహమ్మద్ ద్వారా పఠాన్‌కోట్ ఆపరేషన్ చేయించిందని అంచనా వేస్తున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పరిసరాల్లో భద్రతా దళాల దాడిలో మరణించిన ఉగ్రవాదుల వద్ద లభించిన ఆయుధాలు, ఇతర సామాగ్రి పాకిస్తాన్ సైన్యం హస్తాన్ని స్పష్టం చేస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. భద్రతా దళాల దాడిలో మరణించిన ఇస్లామిక్ ఉగ్రవాదుల వద్ద ఎకె47 ఆటోమెటిక్ రైఫిళ్లు, గ్రెనేడ్ లాంచర్లు, జిపిఎస్ పరికరాలు, పెద్దఎత్తున మందుగుండు సామాగ్రి, ఆహార పదార్థాలు లభించాయి. దీనికితోడు వారు పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌కు చేరుకుని రష్యా సరఫరా చేసిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ధ్వంసం చేసేందుకు సంబంధించిన వ్యూహ పత్రాలు కూడా లభించాయని అంటున్నారు. జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థ వద్ద ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు, ముఖ్యంగా గ్రెనేడ్ లాంచర్లు, ఆధునిక జిపిఎస్ పరికరాలు ఉండేందుకు అవకాశం లేదు. పాకిస్తాన్ సైన్యం ఈ పరికరాలు జైషే మహమ్మద్‌కు సరఫరా చేయటంతోపాటు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడికి సంబంధించిన పూర్తి ప్రణాళికను అందించి ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వస్తున్నాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ధ్వంసం చేయించటం ద్వారా పాకిస్తాన్ సైన్యం తమ సత్తాను చాటాలనుకున్నదని వారంటున్నారు. పాకిస్తాన్‌లో ప్రధాని నవాజ్ షరీఫ్ కంటే సైన్యాధ్యక్షుడి రాహీల్ షరీఫ్ మాటే చెల్లుతుందనేది మరోసారి నిరూపించటంతోపాటు భారత దేశంతో చర్చలు జరపటం తమకు ఇష్టం లేదనే సందేశాన్ని పంపించేందుకే పాక్ సైన్యం జైషే మహమ్మద్ ద్వారా ఈ దాడి చేయించిందని భావిస్తున్నారు.
ఐఎస్‌ఐ తమ గూఢచారుల ద్వారా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై రెక్కీ చేయించిందనేది నిఘా వర్గాలకు ఇదివరకే తెలిసిపోయింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఎయిర్‌మెన్ రాజేష్‌ను నిఘా వర్గాలు ఇటీవల అరెస్టు చేయటం తెలిసిందే. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు సంబంధించి ఐఎస్‌ఐ సంపాదించిన సమాచారాన్ని జైషే మహమ్మద్‌కు అందజేయకపోతే దాదాపు ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎయిర్ బేస్‌లోకి రాగిలిగేవారే కాదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. జైషె మహమ్మద్ అధినాయకుడు అజర్ మసూద్ ఐఎస్‌ఐ చేతిలో కీలుబొమ్మ అనేది అందరికి తెలిసిందే.

దాడి వెనుక ఐఎస్‌ఐ హస్తం
కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి ఆరోపణ

జమ్ము, జనవరి 3: పఠాన్‌కోట్ దాడి వెనుక పాకిస్తాన్ సైనికులు, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని జమ్ముకాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ ఆరోపించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం ఏడుగురు మరణించిన నేపథ్యంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. భారత్‌లో కల్లోలాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతోనే పాక్ సైనికులు, ఐఎస్‌ఐ ఈ రకమైన విఘాత కృత్యాలకు పాల్పడుతున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పఠాన్‌కోట్ ఘటన చోటుచేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్నారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రధాని మోదీ అత్యంత సాహసోపేత రీతిలో ఇస్లామాబాద్ వెళ్లారని, ఆ నేపథ్యంలో ఏర్పడ్డ మైత్రీ బంధాన్ని దెబ్బతీయలనే ఉద్దేశంతోనే ఈ తాజా దాడి జరిగిందని నిర్మల్ సింగ్ అన్నారు.
ఇరు దేశాల మధ్య సమస్యలు ఎంత తీవ్రమైనవైనా వాటిని చర్చా మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిందేనని ఉద్ఘాటించారు.