తెలంగాణ

భేష్.. భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని తమిళనాడు ఆదర్శంగా తీసుకుందని, ఈ తరహా ప్రాజెక్టు రాష్ట్రంలో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తమిళనాడు తాగునీటి విభాగం చీఫ్ ఇంజనీర్ వైరవనాథన్ తెలిపారు. హైదరాబాద్ ‘జలసౌధ’లో మిషన్ భగీరథపై తెలంగాణ -తమిళనాడు అధికారుల మధ్య బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మిషన్ భగీరథ తీరుతెన్నులు, పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకు తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి అధికారుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ బృందం క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించింది. జలసౌధలో తెలంగాణ ఉన్నతాధికారులతో ముఖాముఖి చర్చించేందుకు సమావేశమైంది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్‌మోహన్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్‌లో తాగునీటి కొరత రాకూడదన్న లక్ష్యంతో జలాశయాల నుంచే నీటిని వినియోగించేందుకు పథకరచన చేశామన్నారు. వరుసగా రెండు మూడేళ్లపాటు వర్షాలు లేకున్నా తాగునీటికి ఇక్కట్లురాకుండా పథకాన్ని రూపొందించామని వివరించారు. 2017 డిసెంబర్ వరకు తెలంగాణలోని ప్రతి ఆవాసానికి సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంట్రా విలేజ్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. తాగునీటి సరఫరా 98శాతం గ్రావిటీతోనే జరుగుతుందని, అందువల్ల విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చు నామమాత్రంగానే ఉంటుందన్నారు. మిషన్ భగీరథ క్షేత్రస్థాయి ఇంజనీర్లు, ఉన్నతస్థాయి ఇంజనీర్లు, అధికారుల మధ్య మంచి సమన్వయం ఉందని, అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు అధికారుల బృందం అనేక అనుమానాలు వెల్లడించి నివృత్తి చేసుకుంది. మిషన్ భగీరథపై తమిళనాడులో రాజకీయంగానూ, అధికారికవర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రైల్వే, అటవీ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల నుంచి తక్కువ సమయంలో అనుమతులు ఎలా తెచ్చుకున్నారంటూ తమిళబృందం ప్రశ్నించింది. గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది? ప్రస్తుతం అమల్లో ఉన్న తాగునీటి పథకాలను మిషన్ భగీరథతతో ఎలా అనుసంధానిస్తారు? పట్టణ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది? అంటూ తమిళనాడు తాగునీటి విభాగం చీఫ్ ఇంజనీర్ వైరవనాథన్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అత్యంత అద్భుతంగా ఉందని, పథకంపై తాము సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మిషన్ భగీరథ పథకం తరహాలో తమిళనాడులోనూ ఒక పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మిషభ్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్‌రెడ్డి, కృపాకర్ రెడ్డి, విజయపాల్‌రెడ్డి, తమిళనాడు తరఫున వైరవనాథన్‌తోపాటు ఇతర ఇంజనీర్లు సెంథిల్ కుమార్, అలగర్‌స్వామి, పుగజెండి, శక్తిమురగన్, ఎస్కేకన్నన్ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా మిషన్ కాకతీయ
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని పారదర్శకంగా కొనసాగిస్తున్నామని నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తమిలనాడు బృందం హరీశ్‌రావుతో కలిసి మిషన్ కాకతీయ పథకంపై చర్చించింది. స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకే చెరువులు, కుంటలను ఎంపిక చేస్తున్నామని మంత్రి వివరించారు. టెండర్ల ప్రక్రియ, పనుల్లో రాజకీయ జోక్యం లేకుండా చేశామన్నారు.

మిషన్ భగీరథ పథకం వివరాలు తెలుసుకుంటున్న తమిళనాడు ఉన్నతాధికారుల బృందం