జాతీయ వార్తలు

టార్గెట్ 2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రాష్ట్రాల్లో కమల వికాసం
సాధించిన విజయాలతో సంతృప్తి వద్దు
భావి లక్ష్యాల సాధనే కీలకం
బిజెపి కార్యనిర్వాహక భేటీలో అమిత్ షా పిలుపు
జనంలోకి మోదీ.. రోడ్ షో గ్రాండ్ సక్సెస్
మార్గమంతా నినాదాల జోరు

భువనేశ్వర్, ఏప్రిల్ 15: మరో రెండేళ్లలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గం శనివారం ఇక్కడ భేటీ అయింది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోదీ, 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హజరయ్యారు. ప్రధాని మోదీకోసం ఎలాంటి బహిరంగ సభ ఏర్పాటు కాకపోవడంతో అంతకు మించిన స్థాయిలోనే రోడ్ షో నిర్వహించాలని బిజెపి సంకల్పించింది. రోడ్‌షోలో పాల్గొన్న మోదీకి వేలాదిగా జనం స్వాగతం పలికారు. భద్రతా నిబంధనలను పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో మోదీ జనంలోకి వెళ్లడం అధికారులను పరుగులు పెట్టించింది. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బిజెపి భేటీ జరుగుతున్న జనతా మైదాన్ వరకూ మోదీ రోడ్‌షో జరిగింది. జాదవ్ విహార్ రోడ్డులో కొందరు నేతల్ని కలుసుకున్న మోదీ ముందుకు నడిచి వెళ్లడంతో అధికారులు అవాక్కయ్యారు. బారికేడ్లను ఛేదించుకుని మోదీని సమీపించేందుకు ప్రయత్నించిన వేలాది మందిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది తంటాలు పడాల్సివచ్చింది. మోదీ..మోదీ అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఇంతకు ముందు విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు సంప్రదాయక రీతిలో స్వాగతం పలికారు.
అన్ని స్థాయిల్లో గెలిస్తేనే స్వర్ణయుగం
‘పంచాయతి నుంచి పార్లమెంట్ వరకూ’ అన్ని స్థాయిల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించే దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు దూసుకెళ్లాలని పార్టీ సదస్సులో మాట్లాడిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. అలాగే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఇప్పటి వరకూ బిజెపికి పెద్దగా బలం లేని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పదమూడు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉన్నంత మాత్రాన పార్టీకి స్వర్ణయుగం వచ్చినట్టు కాదని, కేరళ, బెంగాల్, ఒడిశా సహా మిగతా రాష్ట్రాల్లో గెలిచినప్పుడే ఇది సాకారమవుతుందని ముఖ్యమంత్రులు సహా ఈ సమావేశానికి హాజరైన 350మందిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమిత్ షా అన్నారు. ఇటీవల జరిగిన యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల ఘన విజయం సాధించినంత మాత్రాన సరిపోదని, భావి విజయాలపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే కాకుండా పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకూ అన్ని స్థాయిల్లోనూ బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే అందరి ధ్యేయం కావాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అనువంశిక పాలన, కులతత్వం, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన పార్టీలను తిరస్కరించడంగానే పరిగణించాలని అమిత్ షా పేర్కొన్నారు. ఒకప్పుడు మూడింట రెండొంతుల మెజార్టీనే ఘనమని విశే్లషకులు భావించేవారని, ఇప్పుడు నాలుగింట మూడొంతుల మెజార్టీనే ప్రామాణికంగా మారిందన్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన అద్భుత విజయం 2014నాటి ఫలితాలను పునరావృతం చేసిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనే తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఎన్నికల కమిషన్ నిజాయితీని, నిబద్ధతను శంకించడమేనన్నారు. కాగా, తదుపరి దశా ఎన్నికల్లో విజయానికి వీలుగా పార్టీ కార్యకర్తలందరూ పక్షం రోజుల పాటు స్థానిక స్థాయిలోనే గడపాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ వరకూ అంటే 95రోజుల పాటు తాను అట్టడుగు స్థాయి కార్యకర్తలతోనే గడుపుతానని చెప్పారు. ఇప్పుడు ఒడిశాలో అధికారంలోకి రావడమే బిజెపి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అమిత్ షా ‘ రాష్ట్రంలోని 21 పార్లమెంట్ స్థానాల్లో బిజెపి ఒకే ఒక్క సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అసెంబ్లీలో కేవలం 10మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మరింతగా వేళ్లూనాల్సిన అవసరం ఉంది. సంఘటిత శక్తితో ముందుకు దూసుకెళితే ఇక్కడ అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదు’అని షా పిలుపునిచ్చారు.

చిత్రం... వనేశ్వర్‌లో నిర్వహిస్తున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన సందర్భంలో రోడ్ షో నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
జ్యోతి ప్రజ్వలనతో కార్యవర్గ సమావేశాలు ప్రారంభిస్తున్న మోదీ. చిత్రంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ