ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల్లో భారత్‌దే రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ప్రపంచంలో మరే దేశంలోనూ జరగనన్ని రోడ్డు ప్రమాదాలు మన దేశంలో జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటి నివారణపై తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏనాడో అటకెక్కిన ట్రాఫిక్ నియమ నిబంధనలను ఇక కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చర్యలు తీసుకున్నారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో లారీ యజమానులు వివిధ డిమాండ్ల సాధనకు నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో గడ్కరీ రవాణా రంగం, ప్రధానంగా రోడ్డు ప్రమాదాలపై తనంతట తాను లోతుగా అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపరచడానికి రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించేవారికి తెలిసొచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా వెంటనే తెలుసుకోడానికి వీలుగా ఇంటలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థకు రూపకల్పన చేయబోతున్నారు. దేశంలో 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు బోగస్‌వేనని స్వయంగా కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. అందుకే ఇలాంటి సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుర్కోవచ్చంటున్నారు. ప్రధానంగా జరిమానాలు ఉంటే గాని ప్రజలు భద్రతా నియమావళిని సీరియస్‌గా తీసుకోరని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి రహదారి భద్రతా చర్యల్లోనే అనేక లోపాలున్నాయి. వీటిని కూడా గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే అన్ని జాతీయ రహదారుల్లో రోడ్డు నియమ నిబంధనల సూచికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది.
అడ్రస్ లేని రోడ్డు భద్రత!
అభివృద్ధికి సోపానాలైన రోడ్లు నేడు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, చేపడతామని పాలకులు పదేపదే చెబుతున్నా ప్రమాదాలు జరిగిపోతూనే ఉన్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే కొత్త రోడ్ల నిర్మాణం జరిగేకొద్దీ వాహనాల సంఖ్య, వేగం పెరిగేకొద్దీ ప్రమాదాల సంఖ్య కూడా రెట్టింపు కావటం ఖాయం. ఆయా ప్రమాదాల్లో భర్తలను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇలా లక్షలాది కుటుంబాలు పడిన, పడుతున్న మానసిక వేదన వర్ణనాతీతం. ఇటీవలి కాలంలోనే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు 50 మందితో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా మూలపాడు వద్ద కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రకరకాల విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మితిమీరిన వేగమా, ఒకే డ్రైవర్ ఉండి నిద్రమత్తులో జోగటమా.. అతను మద్యం మత్తులో ఉండటం కారణమా? అనే ప్రశ్నలు తలెత్తాయి. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న ప్రమాదాల నివారణకు త్రికరణశుద్ధిగా ఎక్కడా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పాలకుల నుంచి ఎన్నో రకాల హామీలు, ప్రకటనలు జారీ అవుతున్నాయి.
పౌరుల ఉదాసీన క్షంతవ్యం కాధు!
రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్క ప్రభుత్వం బాధ్యతేనని పౌరులు ఉదాసీనంగా వ్యవహరించడం కూడా ఏమాత్రం క్షంతవ్యం కాదు. మన భద్రత మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు ప్రధానంగా అప్రమత్తంగా వాహనాలు నడపటం, డ్రైవింగ్‌లో ఉత్తమ శిక్షణ పొందటం మాత్రమే ఏకైక పరిష్కార మార్గం. దేశంలో ప్రతి నాలుగు నిముషాలకోసారి రోడ్డు ప్రమాదం జరుగుతోంది. 2014లో 2లక్షల 37వేల ప్రమాదాలు జరిగాయి. 85 వేల 462 మంది మరణించారు. 2 లక్షల 60వేల మంది గాయపడ్డారని అధికారులు సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. అందుకే గత మార్చి మాసాంతం నుంచి జాతీయ రహదారుల వెంబడి కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించరాదని, అలాగే పాతవాటి లైసెన్సులు పునరుద్ధరించరాదని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రమాదాల నివారణపై దృష్టి
ఇక ప్రభుత్వం 2020 నాటికి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను కనీసం 50శాతం వరకైనా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక శాతం ప్రమాదాలు డ్రైవర్ల అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రమాదాలకు 28 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలే కారణమవుతున్నాయి. 52 శాతం ప్రమాదాలు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెబుతున్నారు. వాహనచోదకులు సీట్ బెల్టులు, హెల్మెట్లు ధరించకపోవడం కూడా మరణాలకు ప్రధాన కారణవౌతోంది. అందుకే 2017-18 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కేవలం రహదారుల కోసమే రికార్డు స్థాయిలో 4వేల 041 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది కేవలం రహదారుల నిర్వహణకు రూ.735 కోట్లు కేటాయించారు. తాజాగా ఆ మొత్తం రూ.1102 కోట్లకు పెంచి నిధులు సమకూర్చారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 470 కి.మీల మేర రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేశారు. రాష్టవ్య్రాప్తంగా 6వేల 800 కి.మీల మేర సింగిల్ లైన్ రహదారులు ఉండగా 2017-18లో కనీసం వెయ్యి కి.మీలను డబుల్ లైన్‌గా విస్తరించాలని ప్రత్యేకంగా విధులు కేటాయించారు. ఇందులోభాగంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో 372 కి.మీల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించబోతున్నారు. భోగాపురం నుంచి విశాఖ వరకు కాకినాడ సముద్ర కారిడార్ విస్తరణకు సంబంధించి భూసేకరణకు నిధులు ప్రతిపాదించారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి అవసరమైన భూసేకరణకు నిధులు కేటాయించడమేకాక 2019 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ రహదారి పూర్తయితే రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి ప్రయాణం సులభతరం కానుంది. ప్రపంచ బ్యాంక్ రుణ సదుపాయంతో 3వేల కి.మీల మేర రాష్ట్ర రహదారులను విస్తరించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించటం కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.