జాతీయ వార్తలు

వీళ్లు.. ‘మహా ముదుర్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో దాడికి తెగబడిన ఉగ్రవాదులు ‘ఎంతో శిక్షణ’ పొందినవారని, 2008లో ముంబయిలో నరమేథానికి పాల్పడి వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరుల కంటే వీరు ఎంతో ఆరితేరిన వారని, పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వచ్చిన ఉగ్రవాదులు వైమానిక స్థావరానికి భారీ నష్టం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారితో భద్రతా దళాలు జరిపిన సుదీర్ఘ పోరాటాన్ని బట్టి స్పష్టమవుతోందని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సాధ్యమైతే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో కనీసం ఒక్కడినైనా సజీవంగా పట్టుకోవాలని భద్రతా దళాలు ప్రయత్నించాయని, అనవసరమైన రిస్కు తీసుకుని ప్రాణాలు బలిచేసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి పారికర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం కూడా భద్రతా దళాల ఆపరేషన్ సుదీర్ఘంగా మూడు రోజుల పాటు కొనసాగడానికి కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడి సందర్భంగా ఏడుగురు భద్రతా సిబ్బందిని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందన్న ప్రశ్నకు కూడా ఈ వర్గాలు వివరణ ఇచ్చాయి. అక్కడ తెల్లవారు జామున 3.30 గంటలకు షిప్టుల మార్పిడి జరుగుతున్న రెస్టు రూమ్‌పై ముష్కరులు దాడికి తెగబడటంతో డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ (డిఎస్‌సి)కు చెందిన ఐదుగురు సిబ్బంది మృతిచెందారని, అయినప్పటికీ వీరిలో ఒక జవాను ప్రాణాలను కోల్పోవడానికి ముందు తన తుపాకీతో ఒక ఉగ్రవాదిని హతమార్చాడని, అలాగే ముష్కరులతో భద్రతా దళాలు జరిపిన పోరాటంలో ఒక గార్డు కమెండోను కోల్పోవాల్సి వచ్చిందని ఆ వర్గాలు వివరించాయి. అయితే భద్రతా దళాల కాల్పుల్లో హతమైన ఒక ఉగ్రవాది మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగిస్తుండగా బాంబు పేలి ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డు) లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మరణించడం దురదృష్టకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉన్న మిగ్-21 యుద్ధ విమానాలు, ఎంఐ-25 హెలికాప్టర్లతో పాటు ఇతర ఆస్తులకు భారీ నష్టం కలిగించేందుకు ముష్కరులు పన్నిన కుట్రను భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆ వర్గాలు వివరించాయి.
బలగాల మధ్య సమన్వయ లోపం
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో దాడికి తెగబడిన పాక్ ముష్కరులను ఏరివేయడంలో భద్రతా బలగాల మధ్య సమన్వయం కొరవడిందని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్‌లో వివిధ విభాగాలకు చెందిన భద్రతా బలగాలు పాల్గొనడం ఏమిటని వారు ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినందున భద్రతా బలగాలు తొందరపాటు చర్యలకు దిగాల్సిన అవసరం లేదని, ఎన్‌ఎస్‌జి లెఫ్టినెంట్ సహా ఇప్పటికే ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయిన మనం అనవసరంగా తొందరపడితే మరిన్ని ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.