జాతీయ వార్తలు

‘ఎర్ర బుగ్గ’లకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఐపి సంస్కృతికి చరమగీతం
ప్రధానికీ మినహాయింపు లేదు
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం
మే 1నుంచి అమల్లోకి ఆదేశాలు
అత్యవసర వాహనాలపై నీలం లైట్లు
108 (2) రూల్‌కు కేంద్రం సవరణ

మే 1నుంచి విఐపిల కార్లపై ఎర్ర బుగ్గలు ఉండవు. ఆ సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలికినట్టే. పోలీసులు, అగ్నిమాపకదళం, అంబులెన్సులపై మాత్రం నీలం రంగు లైటు పెట్టుకునేలా 108 (2) నియమాన్ని సవరిస్తున్నాం.
-అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విఐపి కార్లపై ఎర్ర బుగ్గల సంస్కృతికి స్వస్తి పలికింది. ప్రధాని, ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు సహా ప్రముఖులెవ్వరూ తమ కార్లపై ఎర్ర లైట్లు పెట్టుకుని హడావుడి ప్రయాణాలతో సగటు మనిషికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. దేశం మొత్తంమీద ఎర్ర లైట్ల సంస్కృతి మే 1నుంచి అంతరించిపోనుంది. ఆ తరువాత ఎవరైనా కారుపై ఎర్ర లైట్లు పెట్టుకుని ప్రయాణిస్తే శిక్షార్హులే. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ముఖ్యమైన సేవలు అందించే పోలీసులు, అగ్నిమాపకదళం, అంబులెన్స్‌లు మాత్రం నీలంరంగు లైట్లు పెట్టుకునేందుకు వీలు కల్పించారు. కేబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పిఐబి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కార్లపై ఎర్ర లైటు పెట్టుకుని రోడ్లపై సామాన్యులకు ఇబ్బంది కలిగించే విఐపి సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం చాలాకాలంగా యోచిస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ చర్చల పరంపర కొనసాగించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం కార్లపై ఎర్ర లైట్ల సంస్కృతి నిలిపివేద్దామన్న ప్రతిపాదనను బుధవారం కేబినెట్ ముందు పెట్టారని జైట్లీ వివరించారు. ‘అధికార దర్పం కోసం కొందరు, విఐపి అనే అభిప్రాయం కలిగించేందుకు ఇంకొందరు వాహనాలపై ఎర్ర లైట్లు పెట్టుకుని సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విఐపి సంస్కృతిని తొలగించేందుకే కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది’ అని జైట్లీ వివరించారు. ఎర్ర లైటుకు వీలుకల్పించే చట్టంలోని 108 రూల్‌ను తొలగిస్తున్నామని వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపకదళం, అంబులెన్సులపై నీలంరంగు లైటు పెట్టుకునేందుకు వీలుగా 108 (2) నియమాన్ని సవరిస్తున్నట్టు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, ఎర్ర బుగ్గ తొలగించి సాధారణ ట్రాఫిక్‌లో వెళ్లటం తెలిసిందే. ప్రధాని కాన్వాయ్ కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను నిలిపివేయటం జరగలేదు. ఇకమీదటా ప్రధాని ఎక్కడికెళ్లినా ట్రాఫిక్‌ను స్తంభింపచేసే చర్యలు ఉండవని పోలీసులు అంటున్నారు. అలాగే యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌లు కార్లపై ఎర్ర లైట్ల సంస్కృతిని నిలిపివేయటం తెలిసిందే.
ఎర్ర బుగ్గల సంస్కృతిని తొలగించాలంటూ సుప్రీం కోర్టు 2013లో కేంద్రాన్ని ఆదేశించటం తెలిసిందే. అయితే కేంద్రం ఇప్పుడు రాజ్యాంగ పదవులతోపాటు ఇతర పదవులు నిర్వహించేవారి కార్లపైనా ఎర్ర లైట్లు పెట్టుకోకుండా చర్యలు తీసుకుంది. ఇంతకాలం దాదాపు 30 క్యాటగిరీల కింద వివిధ స్థాయిల్లోని వారికి తమ కార్లపై ఎర్ర బుగ్గ పెట్టుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 108 రూలు కింద అనుమతిచ్చేవి. మే 1నుంచి ఆ సంస్కృతి ఇక మాయమవుతుంది.
chitram...
కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు క్రీడామంత్రి కారు నుంచి ఎర్ర బుగ్గను తొలగిస్తున్న డ్రైవర్