ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’ పగ్గాలు దళితుడికే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 23: తెలుగుదేశం ఏపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా దళితుడిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న మహానాడులో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ వర్గానికి చెందిన ఎల్ రమణను ఏనాడో నియమించిన నాయకత్వం, ఏపిలో ఎస్‌సికి పగ్గాలు అందించడం ద్వారా కుల సమీకరణను సమం చేయవచ్చనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ జాతీయ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఏపి రాష్ట్ర శాఖకు దళితుడిని అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణకు సన్నిహితుల వద్ద ఆయన తెరలేపినట్లు తెలిసింది. అప్పుడు మూడు శాఖలకు ఓసీ, బీసీ, ఎస్సీలు అధ్యక్షులుగా ఉండటం ద్వారా అన్ని కులాలకు ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే సముచిత స్థానం ఇస్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం మంత్రిగా నియమితులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు బీసీ వర్గంలోని తూర్పుకాపు కులానికి చెందిన సీనియర్ నాయకుడు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాద రహితునిగా పేరు, అందరినీ సమన్వయం చేసుకునే నైజం, విభేదాలను శాంతంగా పరిష్కరించే తీరు ఇప్పటివరకూ పార్టీకి పనికి వచ్చాయి. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఇరువర్గాలను పిలిచి పరిష్కార మార్గాలు సూచించడం ద్వారా అధినేత అప్పగించిన బాధ్యతలను ఆయన విజయవంతంగా నిర్వర్తించగలిగారు. దానికితోడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఆయనను చూసి చాలా నేర్చుకున్నారు. అయితే ఆయనను కొత్త కేబినెట్‌లో మంత్రిగా తీసుకున్నందున పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది. ఆయన స్థానంలో కాపు వర్గానికి చెందిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను నియమించాలన్న యోచన కూడా చేశారు. అయితే ఆయన మళ్లీ ఎన్నికలపై దృష్టి సారించాల్సి ఉండటం, దానికితోడు చినరాజప్ప కూడా అధ్యక్ష పదవిపై అంత ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. ఈ క్రమంలోనే దళిత అభ్యర్థి ఆలోచన తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత దళితుల్లో ఎక్కువ జనాభా ఉన్న మాల వర్గానికి అనూహ్యంగా చేరువైన బాబు, వారికి గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఓటుబ్యాంకును కొల్లగొట్టగలిగారు. తర్వాత వైసిపిలో కీలక పాత్ర పోషించిన నాటి వైఎస్ అనుచరుడు, మాలమహానాడు నేత జూపూడి ప్రభాకర్‌రావును పార్టీలోకి తీసుకొని ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే వర్గానికి చెందిన కారెం శివాజీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడం, తాజాగా నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మాలలు వైసిపి వైపు వెళ్లకుండా బాబు అడ్డుకట్ట వేయగలిగారు. అయితే సీనియర్ అయిన మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ మాత్రం అన్యాయానికి గురయ్యారని, ఆయనను నాయకత్వం వాడుకుని వదిలేసిందన్న విమర్శలు ఆ వర్గంలో వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన మాదిగ వర్గాన్ని దరిచేర్చుకునేందుకు బాబు చేసిన ప్రయత్నంలో భాగంగా జవహర్‌కు మంత్రి పదవి ఇవ్వగా, అంతకుముందే జగన్‌పై తనదైన శైలిలో నిరంతరం విరుచుకుపడటంలో ముందుండే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు, బాబు సొంత జిల్లా చిత్తూరు-కర్నూలు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా అదే వర్గానికి చెందిన వివాద రహితుడైన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం ద్వారా తాను మాదిగలకూ దగ్గరివాడినేనన్న సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో మాల లేదా మాదిగల్లో ఎవరికి ఇచ్చినా దళితుడికే అధ్యక్ష పదవి ఇవ్వడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు బిజెపి బహిరంగ మద్దతు ఇస్తున్నందుకు మాదిగ దండోరా దళపతి మందకృష్ణ మాదిగ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అప్పుడు టిడిపి కూడా మొదటి నుంచీ మద్దతుదారుగా ఉన్న మాదిగ వర్గానికే అధ్యక్ష బాధ్యతలిస్తే ఆ వర్గంలో ఇమేజ్ ఉన్న కృష్ణమాదిగ కూడా టిడిపిని సమర్థించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మాదిగలు పార్టీకి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. దానికితోడు ఏపిలో మాదిగకు పట్టం కడితే తెలంగాణలో పెద్దసంఖ్యలో ఉన్న మాదిగ వర్గం కూడా పార్టీకి చేరువవుతుందని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.