జాతీయ వార్తలు

చంద్రబాబే అడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు విభజనపై నరేంద్రమోదీకి కెసిఆర్ ఫిర్యాదు
తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రాష్ట్ర సచివాలయం, శాసన సభలను నిర్మించుకున్న ఆంధ్ర సిఎం చంద్రబాబు ప్రభుత్వం, కోర్టు భవనం నిర్మించకుండా దురుద్దేశంతో హైకోర్టు విభజనను ఆపుతున్నారని తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం మోదీతో గంటన్నరపాటు ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన, విభజన హామీల అమలు, కేంద్ర సహాయం తదితర అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్త భవనం నిర్మించి ఇచ్చిన మరుక్షణం హైకోర్టును విభజించి ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయ శాఖ చెబుతోంది. కొత్త సచివాలయం, శాసన సభలను నిర్మించుకున్న ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు మాత్రం భవనాన్ని నిర్మించటం లేదని చంద్రశేఖరరావు ప్రధాని దృష్టికి తెచ్చారు.
ప్రధానితో చంద్రశేఖరరావు జరిపిన చర్చల వివరాలను తెరాస సీనియర్ నేత, ఎంపీ బి వినోద్ మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను నిర్మించుకున్న ఏపీ సర్కారు, కోర్టు భవనం ఎందుకు నిర్మించటం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ ఈ అంశాన్ని ప్రధానితో చర్చించారని వెల్లడించారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన చర్యలను తక్షణం తీసుకోవాలని ఆయన నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలుకావటం లేదని ప్రధానికి కెసిఆర్ వివరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును గత రెండున్నరేళ్లుగా కావాలనే జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. సచివాలయం, శాసన సభను నిర్మించుకున్నవారు హైకోర్టు కోసం కొత్త భవనం నిర్మించుకోలేరా? అని కెసిఆర్ ప్రధానితో అన్నట్టు తెలిసింది. హైదరాబాద్ ప్రస్తుతం పేరుకే ఉమ్మడి రాజధాని. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సచివాలంలోని అన్ని కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లిపోయింది. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యాలయం లేదని కెసిఆర్ ప్రధానికి వివరించారు. అన్నింటినీ తరలించుకున్నా, హైకోర్టును హైదరాబాద్‌లోనే పెట్టుకోవటం వెనుక ఎదో మతలబు ఉందనే అనుమానాన్ని ప్రధాని వద్ద కెసిఆర్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏపీకి సంబంధించిన హైకోర్టు కూడా అమరావతిలో ఉండటం మంచిది కదా? అని ఆయన సూచించినట్టు తెలిసింది. ఉమ్మడి హైకోర్టు విభజన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కెసిఆర్ ప్రధానిని కోరినట్టు వినోద్ తెలిపారు. హైకోర్టు విభజన అత్యంత ముఖ్యమైన హామీ. ఇది అమలుకాకుండా చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయటం తదితర వ్యవహారాలతో జాప్యం చేస్తున్నారు అన్నారు. ఏపీ ప్రభుత్వం తమ సంపూర్ణ పాలనను అమరావతి నుంచి నిర్వహిస్తూ హైకోర్టును హైదరాబాదులో కొనసాగించటం ఏమిటని ప్రధాని వద్ద కెసిఆర్ ప్రశ్నించారు. హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన తరగతుల విభాగంలో ఉన్నవారికి కల్పించిన రిజర్వేన్లను అనుమతించాలని ప్రధానిని కెసిఆర్ కోరారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపకం అంశాన్నీ మోదీ దృష్టికి తెచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్నీ నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్టే, తెలంగాణకు చెందిన కాళేశ్వరం లేదా కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇవ్వాలని కెసిఆర్ ప్రధానిని కోరారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయించాలని కూడా ప్రధానిని కెసిఆర్ కోరారు.
భూసేకరణ సవరణకు ఆమోదం
భూసేకరణ 2011 చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలను కేంద్ర న్యాయ శాఖ ఆమోదించిందని వినోద్‌కుమార్ తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించి ప్రాజెక్టులు నిర్మించటం చాలా రాష్ట్రాలకు కష్టంగా తయారైంది. అందుకే తెలంగాణ రాష్ట్రం దీనికి పలు సవరణలు చేసిందని తెలిపారు. భూసేకరణ 2011 చట్టానికి చేసిన సవరణలు ఆమోదించినందుకు రవిశంకర్ ప్రసాద్‌కు కెసిఆర్ కృతజతలు తెలిపారని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు విభజన గురించీ కెసిఆర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అమరావతికి తరలిపోయిన తరువాత కూడా ఉమ్మడి హైకోర్టును కొనసాగించటంలోని ఔచిత్యం గురించి కెసిఆర్ ప్రశ్నించారని వినోద్ చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ చేపట్టండి
ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించాలని సిఎం కెసిఆర్ ప్రధాని మోదీని కోరారు. ఈ డిమాండ్‌కు ప్రజల మద్దతు ఉందని మోదీకి వివరించారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాలని కూడా ఆయన మోదీకి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు మాదిరిగా తెలంగాణలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉన్నారు. కాబట్టి వీరి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ప్రధానికి వివరించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయాలని కెసిఆర్ ప్రధానికి సూచించారు. వ్యవసాయ అనుబంధ వృత్తుల ద్వారా లభించే ఆదాయాన్ని కూడా ఆదాయం పన్ను నుంచి మినహాయించాలని కోరారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ఇతర కుల వృత్తులకు ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వాలని మోదీని డిమాండ్ చేశారు.

చిత్రం... ప్రధాని మోదీతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్